Vemulawada Temple History – Sri Raja Rajeshwara Swamy Devastanam

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి క్షేత్రం

తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆదియోగి పరమశివుడు శ్రీ రాజరాజేశ్వరస్వామిగా కొలువుదీరిన పరమ పవిత్ర క్షేత్రమే శ్రీరాజరాజేశ్వరాలయం. ఈశ్వరుడి పరమభక్తులు ఇక్కడి స్వామిని ఇష్టపూర్వకంగా రాజన్న అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం దక్షిణ కాశీగా కూడా బహుళ ప్రాచుర్యం పొందింది. పూర్వం ఈ ఆలయాన్ని లేములవాడ అనీ, లేంబాల వాటిక అని పిలిచేవారనడానికి ఇక్కడ గల శాసనాలే సాక్షంగా నిలుస్తున్నాయి. శ్రీరాజరాజేశ్వర క్షేత్రంలో శివుడు “నీల లోహిత శివలింగం”రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఈ క్షేత్రాన్ని భాస్కర క్షేత్రం, హరిహర క్షేత్రం అని కూడా పిలుస్తారు. భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వరఖండం శ్రీరాజరాజేశ్వర క్షేత్రం యొక్క గొప్పతనాన్ని వర్ణించింది. దీని వలన ఈ చారిత్రక ఆలయానికి పురాణ విశిష్టత కూడా ఉన్నట్లు విశదమవుతున్నది.

రాజరాజేశ్వర క్షేత్రానికి సంబంధించి పురాణ కథనాలు అనేకం ప్రచారంలో ఉన్నప్పటికీ, ఈ దేవాలయం చాళుక్యుల కాలంలో నిర్మించబడినట్లు పౌరాణిక ఆధారాల ద్వారా తెలుస్తున్నది. క్రీ.శ. 750 నుంచి 973 మధ్య కాలంలో చాళుక్య వంశస్థులలో ఒక శాఖవారు వేములవాడను తమ పరిపాలనా కేంద్రంగా చేసుకొని తెలంగాణను పరిపాలించారు. వీరు వేములవాడ చాళుక్యులుగా ప్రసిద్ది చెందారు. ఈ దేవాలయంలో గల శిలాశాసనాల ఆధారంగా చాళుక్య చివరి రాజు భద్రదేవుడి కుమారుడు మూడో అరికేసరి అని తెలుస్తున్నది. లభించిన ఆధారాలను బట్టి వేములవాడ చాళుక్యులు శ్రీ రాజరాజేశ్వర స్వామిని వంశపారంపర్యంగా కొలుస్తూ వచ్చారని తెలుస్తున్నది. చాళుక్యుల కాలంలో వేములవాడ భీమకవి, సోమదేవ సూరి, పంపన వంటి మహా కవులకు, పండితులకు వేములవాడ శ్రీరాజరాజేశ్వర క్షేత్రం దివ్యమైన స్ఫూర్తిదాయక ప్రదేశంగా ఉండేది.

Interesting Facts about Vemulawada Temple – ఆలయ విశేషాలు

వేములవాడలో పరమశివుడు శ్రీ రాజరాజేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు. ఈ దేలయంలోని గర్భగుడి నిర్మాణం మొత్తం నల్ల చలువరాయితో కూడి ఉంటుంది. దేశంలో గల ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో ఒకటిగా ఉన్న ఈ ఆలయం ప్రాచీన శిల్పకళా సంపదను కలిగి ఉండడమే కాకుండా ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా విశిష్టత సంతరించుకున్నది. ఇందులో గల స్తంభాలు, పై కప్పు మీద చెక్కబడిన శిల్పాలు ఆ కాలంనాటి శిల్పకళకు నిదర్శనంగా నిలిచాయి. దేవాలయ గోపుర నిర్మాణం దక్షిణాది శిల్పకళను ప్రస్ఫుటిస్తుంది. ఆలయంలోని గర్భగుడికి ఎదురుగా ఒక నంది విగ్రహం ప్రతిష్టించబడి ఉంటుంది. శ్రీ రాజరాజేశ్వరిదేవి అమ్మవారు మూల విరాట్టుకు కుడివైపున, శ్రీ లక్ష్మీ సహిత సిద్ధివినాయక విగ్రహం ఎడమవైపున విరాజిల్లాయి. ప్రధాన ఆలయంలో అనంత పద్మనాభస్వామి, శ్రీ సీతారామచంద్ర స్వామి కొలువుదీరి ఉండటం వలన ఇది హరిహర క్షేత్రంగా కూడా ప్రసిద్ది చెందింది. దేవాలయ ప్రాంగణంలో బాలా త్రిపురసుందరీ దేవి ఆలయం, మహిషాసుర మర్ధిని ఆలయం, ఆంజనేయస్వామి ఆలయం, నగరేశ్వర, వేణుగోపాలస్వామి, జగన్మాత స్వరూపిణిగా భావించే బద్దిపోచమ్మ ఆలయాలు కూడా కలవు.

ఆలయ విశిష్టత

వేములవాడ రాజన్నకు ‘కోడె మొక్కుల దేవుడి’గా ప్రత్యేకత కలదు. ఇక్కడికి వచ్చిన భక్తులు ఏదైనా కోరికను కోరుకుని, తమ కోరికలు తీరిన తరువాత ఆలయం చుట్టూ కోడెదూడల్ని తిప్పి ఆలయం ముందున్న స్థంబానికి కట్టేస్తారు. ఈ విధంగా కోడెమొక్కు చెల్లించే సంప్రదాయం ఈ ఆలయంలో తప్ప మరెక్కడా కనిపించక పోవడం ఈ ఆలయ విశిష్టతకు నిదర్శనం. ఇక్కడికి వచ్చే భక్తులు చాలామంది రాజన్నకు తమ తలనీలాలు సమర్పించి తమంత ఎత్తయిన బంగారాన్ని (బెల్లం) మొక్కుగా చెల్లించి తరువాత దానిని ప్రసాదంగా వితరణ చేసే సాంప్రదాయం కూడా ఈ ఆలయంలో కలదు. ధర్మగుండం ప్రత్యేకత

పూర్వం ఈ ధర్మగుండం ఒక మడుగుగా మాత్రమే ఉండేదట. చాళుక్య నరేంద్రమహారాజు కుష్టువ్యాధి గ్రస్తుడై ఉన్నప్పుడు రాజన్న క్షేత్రాన్ని సందర్శించి ధర్మగుండంలో స్నానం చేయడంతో కుష్టువ్యాధి నయమైనదని ఇక్కడి స్థలపురాణం కథనం ద్వారా తెలుస్తున్నది. ధర్మగుండంలో స్నానాలాచరిస్తే ఎటువంటి వ్యాధుల నుంచైనా విముక్తి లభిస్తుందనేది ఇక్కడికి వచ్చే భక్తుల ప్రగాఢ విశ్వాసం.

ఆలయంలో జరిగే నిత్య మరియు ప్రత్యేక పూజలు

శ్రీరాజరాజేశ్వర స్వామికి నిత్యం ప్రధాన పూజలైన కల్యాణం, అభిషేకం, అన్నపూజ, కుంకుమ పూజ, పత్రపూజ, పల్లకి సేవ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం మాస శివరాత్రి రోజున నిర్వహించగా, ఆరుద్రనక్షత్రం ఉండే రోజున మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకంతో పాటూ మహాలింగార్చన కూడా నిర్వహిస్తారు. పునర్వసు నక్షత్రం రోజున మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ప్రదోశపూజ నిర్వహిస్తారు. ‘రేవతి నక్షత్రం సందర్భంగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం మొదలైన ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఆలయంలో నిర్వహించే ప్రత్యేక వేడుకలు రాజన్న దేవాలయంలో ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా మూడు రోజులు వైభవోపేతమైన జాతరను నిర్వహిస్తారు. ఈ సమయంలో తెలుగు రాష్ట్రాల నుంచే కాక పొరుగు రాష్ట్రాల నుండి కూడా లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించుకోవడానికి తరలివస్తారు. శ్రీరామనవమి ఉత్సవాలు కూడా కన్నుల పండుగగా జరుపుతారు. త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు, ముక్కోటి ఏకాదశి పర్వదినం, దేవీ శరన్నరాత్రోత్సవాలు కూడా విశేషంగా నిర్వహించబడతాయి.