Ananthagiri Temple History In telugu – Know The interesting Facts

ప్రకృతి రమణీయత, ఆధ్యాత్మికతల సిరి… అనంతగిరి

అనంతానంత దేవేశ అనంత ఫలదాయక | 
అనంత దుఃఖనాశాయ అనంతాయ నమోనమః ||

అని శరణువేడిన భక్తులను అనుగ్రహిస్తూ వారి పాలిట కల్పతరువుగా శ్రీమహావిష్ణువు స్వయంభూ సాలగ్రామ శిలా రూపంలో శ్రీలక్ష్మీ అనంత పద్మనాభుడుగా వెలసిన ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రం అనంతగిరి. మిగతా అనంత పద్మనాభ స్వామి ఆలయాల్లో లాగా శేషతల్పంపై పవళించినట్లుగా కాకుండా స్వామివారు ఇక్కడ సంపూర్ణ సాలగ్రామ శిలారూపంలో మాత్రమే దర్శనమిస్తారు.
తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో గల ఈ ప్రముఖ దేవాలయం ఆధ్యాత్మికతకు నెలవుగానే కాకుండా ప్రకృతి రమణీయతకు కూడా నిదర్శనంగా నిలుస్తుంది. అనంతగిరి కొండపైన చుట్టూ అటవీ ప్రాంతం ఉండగా మధ్యలో స్వామి ఆలయం నెలకొని ఉంటుంది.

స్థల పురాణం

ఆలయ ప్రాంగణంలో లభిస్తున్న స్థల పురాణం ఆధారంగా ఈ క్షేత్రానికి సంబంధించిన వివరాలు కొంతవరకు తెలుస్తున్నవి. విష్ణుమూర్తి తల్పమయిన ఆదిశేషుని తలభాగం తిరుమలలోని శేషాచలం కొండలు, మధ్యభాగం కర్నూలు జిల్లాలోని అహోబిలం కొండలు కాగా తోకభాగం అనంతగిరి కొండలు అని భావిస్తారు. స్కాందపురాణం ప్రకారం ఈశ్వర సాత్కారం పొందిన తరువాత మార్కండేయుడు బ్రహ్మదేవుడిని ఆరాధించగా, ప్రత్యక్షమయిన బ్రహ్మ ఒక కొండ ప్రదేశాన్ని చూపి అక్కడ తపస్సు చేయమని తెలుపగా, బ్రహ్మ దేవుడి ఆదేశానుసారము కొన్ని వేల సంవత్సరాలు భగవత్ సాక్షాత్కారానికి గాను తపస్సులో మునిగిపోయాడు మార్కండేయుడు.

కలియుగారంభంలో శ్రీమహావిష్ణువు మార్కండేయునికి దర్శనభాగ్యం కల్పించి అతని కోరిక మేరకు స్వయంభూ సాలగ్రమ శిలా రూపంలో అనంతగిరిలో శ్రీలక్ష్మీ అనంత పద్మనాభునిగా కొలువుదీరాడు.

ముచుకుంద వరప్రదాత

ముచుకుందుడు ఇక్ష్వాకు వంశజుడైన మాంధాత తనయుడు. పూర్వం దేవదానవులకు మధ్య జరుగుతున్న యుద్ధంలో దేవతల పక్షాన యుద్ధం చేయాల్సిందిగా ఇంద్రుడు ముచుకుందుడిని కోరగా, అతడి కోరిక మేరకు ముచుకుందుడు సుమారు వెయ్యి సంవత్సరాలు రాక్షసులతో యుద్ధం చేసి దేవతలకు విజయం సాధించి పెట్టాడు. వేయి సంవత్సరాలు యుద్ధం చేసి అలసిపోయిన ముచుకుందుడు తాను సుదీర్ఘ కాలంపాటు విశ్రమించడానికి ఒక చోటు చూపాల్సిందిగా ఇంద్రుడిని కోరగా, దేవేంద్రుడు ఒక కొండ ప్రదేశాన్ని సూచించి విశ్రమించాల్సిందిగా తెలిపాడట. తాను నిద్రిస్తున్న సమయంలో ఎవరైనా తనకు నిద్రాభంగం కలిగిస్తే వారిని కాల్చి బూడిద చేసే వరాన్ని కూడా ఇంద్రుడి ద్వారా పొందాడట ముచుకుందుడు. ఆ విధంగా ఇంద్రుడు సూచించిన కొండప్రాంతంలో గల ఒక గుహలో ముచుకుందుడు నిద్రకుపక్రమించి కొన్ని సంవత్సరాల పాటు నిద్రలో మునిగిపోయాడు.

ఇది గడిచిన అనేక సంవత్సరాల తరువాత ద్వాపరయుగంలో కాలయవనుడు అనే రాక్షసుడు తాను పొందిన వర ప్రభావాల కారణంగా లోక కంఠకుడుగా మారాడట. కాలయవనుడు శ్రీకృష్ణుడితో యుద్ధానికి గాను ద్వారకా నగరంపై కూడా దండెత్తి వచ్చాడట. యాదవులెవరిచే సంహరించబడకుండా ఉండే వరాన్ని పొందిన కాలయవనుడిని అంతమొందించడానికి శ్రీష్ణుడు తాను కాలయవనుడికి భయపడి పారిపోయినట్లు నటించి ముచుకుందుడు నిద్రిస్తున్న గుహలోనికి వచ్చి దాక్కొన్నాడట. శ్రీకృష్ణుడిని వెంబడించి గుహలోకి వచ్చి కాలయవనుడు అక్కడ నిద్రిస్తున్నది శ్రీకృష్ణుడే అని భ్రమించి ముచుకుందుడికి నిద్రాభంగం కలిగించాడట. నిద్రాభంగం కలిగిన ముచుకుందుడి తీక్షణ చూపులకు కాలయవనుడు భస్మం అయిపోయాడట. ఆ విధంగా వైష్ణవమాయతో ధర్మ సంస్థాపనార్ధం రాక్షస సంహారం జరిగిందని శ్రీమద్భాగవత పురాణం ఆధారంగా తెలుస్తున్నది. ఆ తరువాత ముచుకుందుడు శ్రీకృష్ణుడిని సేవించి, స్వామి పాదాలను కడిగిన జలాలు జీవనదిగా మారిపోయాయని, కాలక్రమంలో ఆ జీవనదియే ముచుకుందా నదిగా ప్రసిద్ధి గాంచిందని, నాటి ముచుకుందా నదియే నేటి మూసీనదియని భక్తుల విశ్వాసం. అనంతగిరి కొండల్లో మూసీనది జన్మస్థానం ఆనవాళ్ళు ఇప్పటికీ కనిపిస్తాయి.

ఈ విధంగా మార్కండేయుడికి బ్రహ్మదేవుడు, ముచుకుందుడికి ఇంద్రుడు సూచించిన కొండప్రాంతమే నేటి ప్రసిద్ధ అనంతగిరి అని పురాణ కథనాల ద్వారా తెలుస్తున్నది. ఈ క్షేత్ర దర్శనానికి వచ్చిన భక్తులందరికీ గంగాస్నానమాచరించిన ఫలాన్ని ప్రసాదించాల్సిందిగా మార్కండేయ మహర్షి కోరగా, స్వామి ఆజ్ఞమేరకు గంగాదేవి స్వయంగా అనంతగిరిలో పుష్కరిణిగా కొలువై ఉన్నట్లు ఒక కథనం ప్రచారంలో గలదు.
ఉత్సవాలు… జాతరలు

ఇంతటి మహిమాన్వితమైన క్షేత్రంలో ప్రతి ఏటా అనేక ఉత్సవాలు జాతరలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలకు రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలి వస్తారు. ఆశాఢ మాసంలో చిన్న జాతరను, కార్తీక మాసంలో పెద్ద జాతరను నిర్వహిస్తారు. కార్తీక శుద్ధ పాడ్యమి నుండి పౌర్ణమి వరకు 15 రోజుల పాటు జరిగే జాతరలో భాగంగా క్షేత్రాన్ని అంగరంగ వైభంగా అలంకరించి ప్రత్యేక పూజలు, పల్లకి సేవ, రథోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

దేవాలయం కింది భాగంలో పుష్కరిణి కలదు. ఈ పుష్కరిణిని చేరడానికి అనువుగా మెట్ల మార్గాన్ని కూడా ఏర్పాటు చేశారు. పుష్కరిణికి వెళ్ళే దారిలో అలనాడు మార్కండేయుడు తపస్సు ఆచరించాడనడానికి సాక్ష్యంగా ఒక తపోవనం కూడా కలదు. అందులో మార్కండేయ మహర్షి విగ్రహం కూడా ప్రతిష్ఠించబడి ఉంటుంది.

Beautiful Places Near Ananthagiri Hills – ప్రకృతి అందాలకు నెలవు

తెలంగాణలో ఆకర్షణీయమైన పర్వత ప్రాంతాల్లో ఒకటైన అనంతగిరి కొండలలో అనేక ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు కలవు. నిత్యం పచ్చదనాన్ని కలిగి ఉండే దట్టమైన అటవీ ప్రాంతమైన అనంతగిరి కేవలం ఆధ్యాత్మిక ఆలయంగానే కాకుండా ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా రూపుదిద్దుకున్నది. ఈ కొండలపై గల ప్రకృతి సౌందర్యం పర్యాటకులను మంత్రముగ్ధులను చేసేంతటి ఆకర్షణీయమైన వాతావరణంను కలిగి ఉంటుంది. ఈ కొండలపై నుండి జాలువారే నీరు ఉస్మాన్ సాగర్, అనంతసాగర్ జలాశయాలకు నీటిని అందిస్తున్నాయి. మూసీనది జన్మస్థానం ఈ కొండల్లోనే కలదు. ఇక్కడ ఉద్భవించిన మూసీనది తూర్పు దిశగా ప్రవహిస్తూ హైదరాబాద్ నగరాన్ని చేరి, అటుపైన నల్లగొండ జిల్లాలోని వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. అనంతగిరి కొండలు ప్రకృతి వనమూలికలకు నిలయంగా కూడా ఉన్నవి. వీటిలో అనేక రకాల మూలికలుండడం వలన ఇక్కడి శుద్ధమైన గాలితో అనేక రోగాలు నయమవుతాయనే నమ్మకం కూడా కలదు. రక్షిత అటవీ ప్రాంతమైన ఈ కొండ అనేక జాతులకు చెందిన వన్యప్రాణులకు ఆవాసంగా కూడా నిలుస్తున్నది.

Most Important Places in Ananthagiri Temple – దర్శనీయ ప్రదేశాలు

అనంతగిరి క్షేత్రానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో బుగ్గ రామేశ్వర దేవాలయం కలదు. ఇక్కడ గల పుష్కరిణిలో సంవత్సరం పొడవునా నీటి ధార రావడం విశేషం. అనంత పద్మనాభస్వామి దేవాలయం నుండి పశ్చిమం వైపున ఒక కిలోమీటర్ దూరంలో హిల్ వ్యూ పాయింట్ ఒకటి కలదు. పర్వతారోహణ ఆసక్తి కలిగిన వారికి ఇది అనుకూలమైన ప్రదేశం. ఈ ప్రాంతమంతా ఎరుపు మట్టితో కప్పబడి ఉండి, వదులుగా ఉండి, రాతి మిశ్రమాలతో కూడిన నేల కావడం వలన పర్వతారోహణకు అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రదేశ సందర్శన పర్వతారోహకులకు మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది.

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా మరియు ప్రకృతి వరప్రసాదానికి నిలయంగా ఉన్న అనంతగిరి కొండలు భక్తిభావంతో వచ్చే వారినే కాకుండా పర్యాటక ప్రియులను కూడా విశేషంగా ఆకట్టుకొంటున్నవి.