Ramji Gond – A True Telangana Hero

Ramji Gond History in Telugu

మధ్య భారతదేశం లోని ప్రాంతమైన గోండ్వానాలో భాగంగా ఉన్న ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ ప్రాంతంలో ఆదివాసీ తెగకు చెందిన గోండు కుటుంబంలో రాంజీ గోండ్ జన్మించాడు. ఆనాటి నిజాం నిరంకుశత్వ పాలనకు, బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీరోచిత పోరాటం జరిపి ఆదివాసుల ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించడానికి నిర్మల్, ఆదిలాబాలతో కూడిన అసిఫాబాదను కేంద్రంగా చేసుకొని కొంతకాలం రాజ్యపాలన చేపట్టాడు. అప్పట్లో ఈ రాజ్యాన్ని జనగావ్ గా పిలిచేవారు. దీనికి ఆనుకున్న ఉన్న నిజాం సంస్థానానికి భద్రతా పరంగా నిర్మల్, ఆదిలాబాద్ ప్రాంతాలు అత్యంత కీలకమైనవి కావడంతో గోండు రాజ్యాన్ని తన రాజ్యంలో కలుపుకోవడానికి నిజాం నవాబు చేసిని ప్రయత్నాన్ని రాంజీ గోండ్ తిప్పి కొట్టాడు.

1857లో జరిగిన భారత ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో రాంజీ గోండ్ నాయకత్వంలో జరిగిన తిరుగుబాటు దేశంలోనే ఆదివాసీ చారిత్రక పోరాటంగా ప్రసిద్ది చెందింది. గోండు నాయకుడైన రాంజీ ఆదివాసీలు, రోహిల్లాలకు నాయకత్వం వహించి బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటుకు చరిత్రలో సముచిత స్థానం లభించనప్పటికీ జనాల గుండెల్లో రాంజీ గోండ్ చిరస్థాయిగా నిలిచిపోయాడు.

రోహిల్లాలు, గోండులు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాంజీ గోండ్ నాయకత్వంలో చేసిన తిరుగుబాటును బ్రిటీష్ పాలకులచే అణిచివేసే ప్రయత్నాలు జరిగాయి. తన నాయకత్వ పటిమతో సమస్త ఆదివాసీ ప్రజానీకాన్ని ప్రభావితం చేసి ముందుకు నడిపించిన గొప్ప నాయకుడుగా రాంజీ గోండ్ గణతికెక్కాడు. 1857 సిపాయిల తిరుగుబాటు కాలంంలో నిజాంకు, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరాఠా, తెలుగు, రోహిల్లా, గోండు సైన్యాలను తన నాయకత్వంలో విజయవంతంగా ముందుకు నడిపించాడు.

ఇతర ప్రాంతాల నుంచి ఆదిలాబాదు తదితర తెలంగాణ ప్రాంతాలకు తరలి వచ్చిన సిపాయిలు, రోహిల్లాలు 1857 తిరుగుబాటులో పాల్గొనడం జరిగింది. నిర్మల్ ప్రాంతంలో రోహిల్లాలు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్నారు. రాంజీ గోండు నాయకత్వంలో వేల సంఖ్యలో గోండు వీరులు విప్లవ కార్యక్రమాలు చేపట్టేవారు. విప్లవకారులు తెలంగాణలో అన్ని జిల్లాలలో అలజడులు సృష్టించి బ్రిటీషు సేనానులను, నిజాం సైన్యమును ముప్పుతిప్పలు పెట్టారు.

హింగోలి ప్రాంతంలో ఉన్న బ్రిటీషు సేనాని కర్నల్ రాబర్ట్ నేతృత్వంలో 47వ రెజిమెంటు, బళ్ళారి ప్రాంతంలో ఉన్న సైనిక పటాలములు తెలంగాణ ఉత్తర జిల్లాలలో విప్లవకారులను అణచడానికి నియమించడినప్పటికీ గోండు వీరులు స్థానికులవడం, రోహిల్లాలు అటవీ ప్రదేశాలలో స్థావరాలు ఏర్పరచుకొని ప్రజలను కూడగట్టుకొని విప్లవాన్ని సాగించడం వలన బ్రిటీష్ ప్రభుత్వానికి విప్లవాన్ని అణచడం సాధ్యం కాలేదు.

ఒకానొక రోజున నిర్మల్ తాలుగైరుకు గూఢచారుల వల్ల రాంజీ గోండు తన అనుచరులతో నిర్మల్ పట్టణానికి అతి దగ్గరలో ఉన్నట్టు సమాచారం అందింది. తాలుగ్గారు తన బలగం, పోలీసులు, సైనికులతో కలిసి రాంజీ గోండు అతని అనుచరులు నివసించే ప్రాంతాన్ని ముట్టడించడం జరిగింది. అప్పటికే రాంజీ గోండ్ 200 మంది రోహిల్లాలు, 300 మంది గోండు, 500 మంది దక్కను విప్లవకారులతో ఒక పటిష్టమైన సైన్యాన్ని ఏర్పాటుచేసుకున్నాడు. నిర్మల్ తాలుగైర్ ముట్టడి సత్ఫలితాలను ఇవ్వలేదు. ముట్టడిలో కొందరు విప్లవకారులు క్షతగాత్రులై, అత్యధికులు పారిపోయి ప్రాణాలను దక్కించుకున్నారు. గెరిల్లా పద్దతిలో ఎదురుదాడి చేసి రాంజీ గోండు అతని అనుచరులు రోహిల్లాలు, గోండులు కలిసి అనేకమంది బ్రిటీష్ సైనికులను సంహరించి, అదను చూసి అడవులలోకి పారిపోయి తలదాచుకున్నారు. 

మరొకసారి నిర్మల్ తాలుక్దార్ 1000 విప్లవకారులున్న ప్రదేశాన్ని సైనిక బలగాలతో ముట్టడించాడు. ఈ బలగాలలో బ్రిటీష్ సైనికులు కూడా ఉన్నారు. విప్లవకారులకు నాగపూర్ నుండి ఆయుధ సహాయం అందేది. ఈ ముట్టడిలో నిజాం సైనికులకు గానీ, బ్రిటీష్ సైన్యానికి గానీ విజయం లభించలేదు. ప్రభుత్వ సైనికులలో ఎక్కువమంది మరణించారు. కొంతకాలం తరువాత రెండవసారి జరిగిన దాడిలో గోండు వీరులు వందల సంఖ్యలో మృతి చెందారు. చివరకు ప్రభుత్వం కఠిన చర్యలను అవలంభించింది. ఈ సంఘర్షణలలో విప్లవకారులు అనేకమంది మరణించారు. మిగిలినవారు బందీలయ్యారు. రాంజీగోండు తప్పించుకొని పారిపోయాడు.

రాంజీ గోండు తప్పించుకున్న సమాచారాన్ని తెలుసుకున్న బ్రిటీషు రెసిడెంటు, నిర్మల్ తాలుక్దార్  ఎలాగైనా రాంజీగోండును బంధించాలని ఆదేశించాడు. నిర్మల్ తాలుక్దార్ పట్టుదలతో అడవులు గాలించి, విప్లవకారులను దొరికిన వారిని దొరికినట్లు బంధించి, మరి కొంతమందిని చంపి, పట్టుబడిన వారిని హింసించి, రాంజీ గోండు ఉన్న ప్రదేశాన్ని తెలుసుకొని చివరికి అతనిని బంధించారు. ప్రభుత్వ ఆదేశానుసారము క్రీ.శ. 1860 ఏప్రిల్ 9వ తేదీన నిర్మల్ పట్టణంలోని ఖజానా చెరువు గట్టున రాంజీ గోండుతో పాటు అతని1000 మందికి పైగా అనుచరులు 1000 ఊడలు గల ఒక విశాలమైన పెద్ద మఱ్ఱిచెట్టుకు ఉరితీయబడినారు. తరువాత కాలంలో ఆ మర్రిచెట్టుకు “వెయ్యి ఉరుల మఱ్ఱి” అని పేరు వచ్చింది.

ఇంతటి వీరోచిత పోరాటాన్ని చేసిన రాంజీ గోండ్ చరిత్రను నిర్లక్ష్యం చేయకుండా ఆయన జరిపిన పోరాటాన్ని, త్యాగాల్ని భావితరాలకు అందించాలి. లేదంటే ఇంతటి మహోన్నతమైన వ్యక్తిని భవిష్యత్తు తరాలు మరిచిపోయే ప్రమాదం ఉంది. తెలంగాణ పోరాట మూలాలను వెతుక్కుంటూ మనదైన చరిత్రను పునర్నిర్మించుకుంటున్న నేపథ్యంలో రాంజీ గోండ్ వంటి వీరుల చరిత్రను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఎంతయినా ఉన్నది.