Shoebullah Khan – షోయబ్ ఉల్లా ఖాన్ | A Fearless Journalist Of The decade

Shoebullah Khan History In Telugu

అక్షరాన్ని అగ్నికణంగా మలిచి హైదరాబాద్ సంస్థానంలోని దొరలు, దేశ్ ముఖ్ లు, రజాకార్లు సాగిస్తున ఆగడాలను, నిజాం నియంత్రృత్వ పరిపాలనను సవాల్ చేస్తూ నిప్పుకణివంటి అక్షరాలతో నిజాం గుండెల్లో దడపుట్టించిన అక్షరవీరుడు షోయబ్ ఉల్లా ఖాన్. పూర్వపు హైదరాబాద్ రాష్ట్ర విముక్తి ఉద్యమ, స్వాతంత్ర్య సమరచరిత్రలో ప్రముఖపాత్ర పోషించిన షోయబ్, నిజాం ప్రభుత్వం పత్రికలను ఉక్కుపాదంతో అణచివేస్తున్న రోజుల్లోనే ప్రభుత్వ దమనకాండలకి వ్యతిరేకంగా వార్తా ప్రచురణలు చేయడానికి ఎవరూ సాహసించని రోజుల్లోనే “ఇమ్రోజ్” అనే పత్రికను స్థాపించి, నిజాం ప్రభుత్వ నిరంకుశ విధానాలను, రజాకర్ల అకృత్యాలను ఎండగట్టిన కలం యోధుడు షోయబ్ ఉల్లా ఖాన్.
హబీబుల్లా ఖాన్, లాయహున్నీషా బేగం దంపతుల సంతానమైన షోయబ్ ఉల్లా ఖాన్ 1920 అక్టోబర్ 17న ఖమ్మం జిల్లా సుబ్రవేడులో జన్మించాడు. తండ్రి రైల్వేలో ఉద్యోగి కాలా తల్లి గృహిణి. షోయబ్ బొంబాయిలో ఇంటర్మీడియట్ వరకు విద్యను పూర్తిచేసిన తరువాత హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి జర్నలిజంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు.

పాత్రికేయుడిగా ప్రస్థానం

వాస్తవానికి షోయబ్ నిజాం ప్రభుత్వంలో సులభంగా ఉద్యోగం పొందేందుకు గాను అన్ని అర్హతలు కలిగి ఉన్నా, తాను నమ్మిన ఆదర్శాల కోసం ప్రభుత్వోద్యోగం చేయకూడదని నిశ్చయించుకున్నాడు. ప్రభుత్వోద్యోగం కన్నా తక్కువ జీతం వచ్చే పాత్రికేయ వృత్తినే ఎంచుకున్నాడు. అతడి పాత్రికేయ జీవితం ఉర్దూ పత్రిక ‘తాజ్’ తో ప్రారంభమయినది. నిజాం ప్రభుత్వ నిరంకుశత్వాన్ని వ్యతిరేకిస్తూ, రజాకార్ల నాయకుడైన ఖాసీం రజ్వీ దురాగతాలను ఖండిస్తూ తాజ్ లో పలు వ్యాసాలు రాయడం ప్రారంభించాడు. నిజాం నిరంకుశత్వం గురించి. దొరలు, పటేల్, పట్వారీలు, భూస్వాములు, రజాకార్లు ప్రజలపై సాగిస్తున్న అకృత్యాలపై విమర్శనాత్మ వ్యాసాలు రాయడం పాలకులకు కంటగింపైనది. ఆ కారణంగా తేజ్ పత్రికపై నిజాం ప్రభుత్వం నిషేధం విధించగా అది కాస్తా మూతబడింది.

కానీ షోయబ్ మాత్రం ఎటువంటి భయానికి లోనుకాకుండా ఆ రోజుల్లో ప్రముఖ స్వాతంత్రోద్యమ నాయకుడైన ముందుముల నరసింగరావు సంపాదకత్వంలో వెలువడుతున్న ‘రయ్యత్’ ఉర్దూ దిన పత్రికలో ఉపసంపాదకుడిగా చేరి తిరిగి తన రచనలు ప్రారంభించాడు. తన పూర్వపు పంథాను కొనసాగిస్తూ నిజాం నిరంకుత్వ పాలన గురించి, దమనస్థితిని, మతోన్మాదాన్ని ఎండగడుతూ నిర్భయంగా వ్యాసాలు రాసేవాడు. దాంతో రయ్యత్ పత్రికపై కూడా నిజాం ప్రభుత్వం నిషేధాజ్ఞలు జారీచేసినప్పటికీ అధైర్యపడకుండా ప్రజల పక్షంగా నిరంకుశ పాలకుల మీద పోరాటం సాగించాల్సిందేనని షోయబ్ కృతనిశ్చయుడైనాడు.

జాతీయస్థాయిలో ఉర్దూపత్రిక లేదనే మనోవేదన పడుతున్న షోయబ్ నరసింగరావు సహాయంతో తానే స్వయంగా జాతీయ పత్రికను ప్రారంభించడానికి ఉద్యుక్తుడైనాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే స్వంత నిర్వహణలో ‘ఇమ్రోజ్’ అనే ఉర్దూ దినపత్రికను స్థాపించాడు. అప్పటి జాతీయవాదులంతా షోయబ్ ప్రయత్నానికి అండగా నిలిచారు. బూర్గల రామకృష్ణారావు గారు ఆర్థిక సహాయం చేశారు. ఇమ్రోజ్ పత్రిక ప్రథమ సంచిక నవంబరు 15, 1947న వెలువడినది. ఆర్థికపరంగా ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఇమ్రోజన్ను ప్రజల పత్రికగా తీర్చిదిద్ది, నిజాం నిరంకుశత్వం, మతదురహంకార శక్తుల మీద తిరుగులేని సమరం కొనసాగించాడు షోయబ్. కొంత కాలానికి ‘ఇమ్రోజ్’కు పాఠకుల సంఖ్య అనుకోని స్థాయిలో పెరగడంతో పత్రికా కార్యాలయాన్ని బూర్గుల వారి నివాసానికి తరలించాల్సి వచ్చింది.

కాలక్రమేణా రాజకీయ పరిస్థితులలో అనేక పరిణామలు సంభవించాయి. ఇటువంటి అననుకూల పరిస్థితుల్లో సైతం సహజంగా ధైర్యశాలి అయిన షోయబ్ తన పత్రిక ద్వారా జాతీయభావాలు వెల్లడిస్తూ, నిజాం ప్రభుత్వ వైఖరిపై విమర్శనాస్త్రాలు వదులుతూ నిజమైన వార్తలను ప్రచురిస్తూండేవాడు. ‘పగటి ప్రభుత్వం.. రాత్రి ప్రభుత్వం’ శీర్షికన రజాకార్ల అకృత్యాలను ఎండగడుతూ 1948 జనవరి 29న షోయబ్ రాసిన సంపాదకీయం పెద్ద ఎత్తున దుమారం రేపింది. షోయబ్ రచనలు రజాకార్ల నాయకుడైన ఖాసిం రజ్వీ కంటగింపుకు కారణమయినవి. రజ్వీ ఏకంగా షోయబ్ కు బెదిరింపు లేఖనే పంపాడు.

ఇమ్రోజ్ పత్రిక నిజాం ప్రభుత్వానికి, రజాకార్లకి వ్యతిరేక గొంతుకగా మారండతో ప్రజల్లో మతాలకతీతంగా చైతన్యం రావడం సహించని ఖాసిం రజ్వీ 1948 ఆగస్టు 19న హైదరాబాద్ లో జరిగిన ఒక సభలో నిజాంకు వ్యతిరేకంగా వార్తలు రాసేవారి చేతులు నరికేస్తామని, పత్రికలను సర్వనాశనం చేస్తామని బహిరంగంగానే బెదిరించాడు. ఇటువంటి బెదిరింపులకు షోయబ్ ఏ మాత్రం బెదరలేదు సరికదా తన రచనలలో పదును కూడా తగ్గించలేదు. ఇమ్రోజ్ పత్రిక ద్వారా నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా వ్రాసినందుకు, నిజాం వ్యతిరేక ప్రజాపోరాటాలను బలపర్చినందుకు మతదురహంకారులు అయిన రజ్వీ అనుయాయులు తగిన సమయం కోసం ఎదురుచూస్తూ ఉన్న సమయంలో 1948, ఆగస్టు 21వ తేదీన అర్ధరాత్రి వరకు కాచిగూడ చౌరస్తాలోని ఇమ్రోజ్ పత్రికా కార్యాలయంలో మరుసటి రోజు పత్రికలో అచ్చువేయడం కొరకు “నేటి భావాలు” అనే శీర్షికతో వ్యాసాన్ని పూర్తిచేసి ఇంటికి బయల్దేరిన షోయబ్ ఉల్లా ఖాన్ మరియు అతడి బావమరిది ఇస్మాయిల్ ఖాన్లపై చప్పల్ బజార్ కూడలి వద్ద ఖాసీంరజ్వీ అతని అనుచరులు తుపాకులతో కాల్పులు జరపగా షోయబ్ నేలకొరిగాడు.

షోయబ్ కుడి చేతిని దుండగులు నరికివేసినారు. అడ్డుపడిన ఇస్మాయిల్ ఎడమ చేతిని కూడా నరికివేశారు. కాల్పుల శబ్దానికి జనాలు అక్కడికి రావడంతో దుండగులు పారిపోయారు. షోయబ్ ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించినా కూడా ప్రాణాలు దక్కలేదు. ఆగస్టు 22 తెల్లవారు ఝామున షోయబ్ అమరుడైనాడు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిజాలను నిర్భయంగా వ్రాసిన పరిణామాలే చివరకు షోయబ్ దారుణ హత్యకు కారణమయ్యాయి. నిజాం ప్రభుత్వం షోయబ్ అంతిమయాత్రను సైతం నిషేధించిగా, పోలీసుల పహారా మధ్య అంతిమయాత్ర నిర్వహించారు. హైదరాబాద్ లోని గోషామహల్ మాలకుంట శ్మశాన వాటికలో షోయబ్ పార్థివ దేహాన్ని ఖననం చేయడం జరిగింది.

హైదరాబాద్ సంస్థానం లోని ప్రజలు మతతత్వ పాలనలో మగ్గకుండా లౌకిక, ప్రజాస్వామిక దేశంలో భాగస్వాములు కావాలని కోరుకున్న ఉదాత్తనీయుడు షోయబ్. దేశ విభజన అనంతరం మత విద్వేషాలు పెచ్చురిల్లుతున్న సమయంలో ఇటువంటి ఉదాత్తమైన భావాలు కలిగి ఉండటమే కాకుండా, నమ్మిన విలువల కోసం ప్రాణాలర్పించడం అసాధారణమైన విషయం. తన ఆలోచనలను కార్యరూపం దాల్చడానికి అక్షరమనే ఆయుధంతో నిజాం ప్రభుత్వ నిరంకుశత్వాన్ని సూటిగా ప్రశ్నించిన గొప్ప ధీశాలిగా, నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ తొలితరం పాత్రికేయుడిగా షోయబ్ ఉల్లా ఖాన్ నేటి పాత్రికేయలకు ఆదర్శప్రాయుడే కాక యావత్ తెలంగాణ ప్రజలకు చిరస్మరణీయుడు కూడా.