Skip to content

Yadagirigutta Temple History – పంచ నారసింహ క్షేత్రం… యాదాద్రి దేవాలయం

కృతయుగంలో శరణువేడిన భక్తుడిని రక్షించడానికి స్తంభాన్ని చీల్చుకుని వచ్చిన శ్రీమన్నారాయణుడు, కలియుగంలో మరో భక్తుడి కోరిక మేరకు యాదగిరిగుట్టపై స్వయంభువుగా వెలిసి పంచ నారసింహ రూపాల్లో తన భక్తులకు దర్శనం ఇస్తున్నాడు స్వామి. యుగాలు మారినా తనను నమ్మిన భక్తుల వెన్నంటి ఉండి అనునిత్యం వారి యోగక్షేమాలు చూస్తూ…తానే సర్వస్వం అని నమ్మిన వారికి అభయాన్నిస్తూ దివ్య పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో కొలువై ఉన్నాడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి. తెలంగాణలో ఈ క్షేత్రం యాదగిరి గుట్టగా బహుళ ప్రాచుర్యం పొందింది. ఇంతటి మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో కలదు.

Yadagirigutta Temple History Facts –స్థలపురాణం

పంచ నారసింహ క్షేత్రంగా ప్రఖ్యాతి గాంచిన యాదాద్రి గురించిన పురాణగాథలు ఎన్నో ప్రచారంలో కలవు. రామాయణ మహాకావ్యానుసారం మహాజ్ఞాని అయిన విభాండకుడి కుమారుడు ఋష్యశృంగుడు. ఋష్యశృంగుడి సతీమణి శాంతాదేవి. వీరి తనయుడే యాదఋషి. ఇతడు బాల్యం నుంచే పరమ హరిభక్తుడు మరియు నృసింహోపాసకుడు. దశావతారాల్లో నాల్గవ అవతారమైన నారసింహావతారంలో శ్రీహరి దర్శనభాగ్యం పొందాలనే బలమైన కాంక్ష కలిగిన యాదఋషి ఒకసారి స్వామి సాక్షాత్కారం పొందడానికి దట్టమైన అడవుల్లో సంచరిస్తూ ఆటవిక జాతివారి చేతికి చిక్కాడు. వారు తమ ఆచారంలో భాగంగా యాదఋషిని తమ కులదేవతకు బలివ్వడానికి సిద్ధమైనారు.

అటువంటి విపత్కర పరిస్థితుల్లో అక్కడ ప్రత్యక్షమైన ఆంజనేయుడు, ఆటవికుల బారినుండి యాదఋషిని రక్షించి, దగ్గరలో గల కీకారణ్యంలో సింహాకార గుట్టలున్నాయనీ అక్కడ సాధన చేస్తే శ్రీహరి సాక్షాత్కారం లభిస్తుందని సూచన చేశాడు. అప్పటి నుండి అనేక సంవత్సరాలు యాదఋషి తపస్సు చేయగా చివరికి అతని తపస్సుకు మెచ్చిన స్వామి నృసింహ రూపంలో దర్శనభాగ్యం కల్పించాడట. కానీ ఆ ఉగ్ర నరసింహ రూపంలో సాక్షాత్కరించిన స్వామిని చూడలేక యాదఋషి కళ్లు మూసుకున్నాడట.

అంతటి తీక్షణత కలిగిన రూపాల్ని తాను చూడలేకపోతున్నానని శాంత స్వరూపంలో దర్శనభాగ్యం కల్పించమని యాదఋషి స్వామిని వేడుకోగా అతడి కోరిక మేరకు శాంతస్వరూపంలో శ్రీ లక్ష్మీ సమేత నారసింహుడు మరల ప్రత్యక్షమై యాదఋషిని అనుగ్రహించాడట. అప్పుడు తన్మయుడైన యాదఋషి స్వామిని వేరు వేరు రూపాల్లో దర్శనభాగ్యం కల్పించాలని కోరుకోగా జ్వాలా, గండభేరుండా, యోగానందా, ఉగ్రనరసింహ, శ్రీ లక్ష్మీనృసింహ స్వామి రూపాల్లో స్వామి ప్రత్యక్షమవగా ఎక్కడైతే స్వామి కటాక్షం తనకు లభించిందో అదే గుహలో సామాన్య భక్తులకు కూడా దర్శనభాగ్యం కలిగించాలని వేడుకున్న యాదఋషి కోరిక మేరకు అవే రూపాల్లో యాదాద్రిలో కొలువై భక్తులకు దర్శనమిస్తున్నాడు స్వామి.

అప్పటి నుంచి ఈ క్షేత్రం యాదఋషి పేరున యాదగిరిగుట్టగా, యాదాద్రిగా (Yadadri) ప్రసిద్ది చెందింది. ఇక్కడ వెలసిన స్వామి మహత్యం, క్షేత్ర వైభవం గురించి తెలిసిన సామాన్య జనులతో పాటు ఎందరో మహారాజులూ, చక్రవర్తులూ స్వామి పాదదాసులుగా మారిపోయారు.

Panch Narasimha Avatars – పంచ నరసింహావతారాలు

ఈ క్షేత్రానికి ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు కాగా, ఆలయానికి తూర్పు వైపున గల కొండ బిలంలో గండభేరుండ నరసింహస్వామి కొలువుదీరి ఉన్నాడు. ఇక కొండగుహలో రెండు శిలలపైన యోగానంద నారసింహుడూ, శ్రీలక్ష్మీనృసింహుడూ విగ్రహరూపంలో దర్శనమిస్తుంటారు. ఈ రెండు శిలల మధ్య జ్వాలా నరసింహస్వామి దర్శనమిస్తాడు. ఉగ్రనారసింహుడు కొండ చుట్టూరా తేజోవలయమై అదశ్య రూపంలో ఉంటాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందువల్లనే యాదగిరిగుట్టనే అయిదవదైన ఉగ్రనారసింహస్వామి రూపంగా కొలుస్తారు.

చరిత్రలోకి తరచి చుస్తే – Deep Into The History Of Sri Laxmi Narasimha Swamy Temple

పశ్చిమ చాళుక్య ప్రభువైన త్రిభువన మల్లుడు క్రీస్తుశకం 12వ శతాబ్దంలోనే శ్రీ నారసింహస్వామిని దర్శించాడని భువనగిరి కోటలో గల చారిత్రక శాసనాల ద్వారా తెలుస్తున్నది. కాకతీయ ప్రభువులు ఈ క్షేత్ర అభివృద్ధికి పాటుపడినట్లు యాదగిరిగుట్ట మండలం సైదాపురం వద్ద లభించిన శాసనాల ఆధారంగా తెలుస్తున్నది. కాకతీయ ప్రభువైన గణపతి దేవుడు, విజయనగర సామ్రాజ్యాన్నేలిన శ్రీకృష్ణదేవరాయలు కూడా స్వామిని దర్శించి ప్రసన్నం చేసుకున్నట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తున్నది. అప్పట్లో భక్తులు కొండమీదికి ఒంటరిగా వెళ్లడానికి వీలు లేకుండా ఉన్న కొండదారిని నిజాంల కాలంలో మార్చి భక్తులు సులభంగా వెళ్ళేలాగా చేశారట. లక్ష్మీదేవి మందిరం, తూర్పు రాజగోపురాల నిర్మాణం 1959లో జరిగింది.

ఆలయంలో నిర్వహించే విశేష పూజలు

యాదాద్రిక్షేత్రంలో స్వామివారికి ప్రతినిత్యం అర్చనలూ, వివిధ రకాల పూజలూ, ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇవి మాత్రమే కాకుండా ఏటా వైశాఖ శుద్ధ ద్వాదశి నుంచి చతుర్దశి వరకు స్వామి జయంతి ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవాలు నిర్వహించే సమయంలో రామాయణ, మహాభారత, భగవద్గీత, క్షేత్రమహత్య కథలు గాథలతో యాదాద్రి శోభాయమానంగా విరాజిల్లుతుంది.

ప్రతిమాసం స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున అష్టోత్తర ఆగమ శాస్త్ర ప్రకారం శతఘటాభిషేకం నిర్వహిస్తారు. ప్రాతఃసమయంలో ప్రారంభమయ్యే ఈ క్రతువులో 108 ఘటాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. శ్రావణమాసంలో శుద్ధ దశమి నుంచి ద్వాదశి వరకు స్వామివారి పవిత్రోత్సవాలు జరుగుతాయి. కార్తిక పౌర్ణమి రోజున అన్నకూటోత్సవం పేరుతో స్వామివారికి మహానైవేద్యాన్ని నివేదిస్తారు. శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రకరమైన ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి రోజున మొదలుపెట్టి వరుసగా ఆరురోజుల పాటు జరిగే ఉత్సవాలలో పాల్గొనేందుకు తండోపతండాలుగా భక్తులు తరలివస్తారు.

Temple Reconstruction – ఆలయ పునర్నిర్మాణం

మహిమాన్వితమైన యాదగిరి శ్రీలక్ష్మీనరసింహ క్షేత్రాన్ని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపొందించాలనే మహత్కార్యంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం వారు ఆలయ పునర్నిర్మాణం చేపట్టి దిగ్వజయంగా పూర్తిచేయడం జరిగింది. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా పూర్వం ఉన్న ఆలయ శైలిని మార్చకుండా, ఎక్కడా ఆలయ ప్రాభవం దెబ్బతినకుండా నిర్మాణం జరగడం విశేషం. అయితే ఆలయం మొత్తం కృష్ణశిలతో సంప్రదాయ రీతిలో నిర్మించడం మరో విశేషం. కాకతీయ, చాళుక్య, హొయసాల, పల్లవ శిల్పకళా నైపుణ్యాలలో కనిపించే ద్రవిడ వాస్తుశైలిలో వైష్ణవ సంప్రదాయం ప్రకారం పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని పునర్నిర్మించారు.

Yadagirigutta Temple Reconstruction Interesting Facts – పునర్నిర్మాణ విశేషాలు

యాదాద్రి దివ్య నారసింహ క్షేత్రాన్ని దేశంలోని ఇతర ఏ ఆలయంతోనూ పోల్చి చూడలేని రీతిలో రకరకాల శిల్పకళా శైలుల వైభవమంతా ఒకే ప్రాంగణంలో నిర్మించి భక్తులకు కనువిందు చేసేలా అత్యంత మనోహరంగా, అనన్యసామాన్యంగా నిర్మించారు. కాకతీయ శైలిలో ముఖ మండపాలూ, ఆళ్వార్ల విగ్రహాలూ, విమాన గోపురాన్ని ద్రావిడ శిల్పకళా రీతిలో, పల్లవ నిర్మాణశైలిలో అష్టభుజి మండపం నిర్మాణం జరిగింది. సింహం బొమ్మలతో చెక్కబడిన స్తంభాలను ఏర్పాటు చేశారు. ప్రవేశ ద్వారానికి దక్షిణం వైపునగల రాతి గోడపై వెండి పలకలతో ప్రహ్లాద చరిత్ర, లోపలి వైపు ప్రాకారంలో యాలీ నిర్మాణాలు అద్భుతంగా చెక్కబడినవి. పల్లవ శిల్పకళారీతులను తలపించే ఏనుగులూ, కాకతీయ-చాళుక్య శైలులను తలపించే స్తంభాలు, హొయసాల శిల్పరీతులను తలపించే ఉప పీఠాలు తీర్చిదిద్దబడినవి.

ఆలయ నిర్మాణంలో వాడిన శ్రేష్ఠమైన కృష్ణశిల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆధారశిల నుంచి శిఖరం వరకు పూర్తిగా కృష్ణశిలను ఉపయోగించి నిర్మాణం పూర్తిచేశారు. నేటి ఆధునిక కాలంలో ఈ విధంగా పూర్తిగా కృష్ణశిలతో ఒక దేవాలయ నిర్మాణం చేపట్టడం నిజంగా విశేషమైనదే. ఈ ఆలయ నిర్మాణానికి వినియోగించిన కృష్ణశిల కాలం గడుస్తున్న కొద్దీ మరింత నునుపుదేలి, నాణ్యతను సంతరించుకుంటుంది.

ఇప్పుడు పునర్నిర్మించినా అది వంద సంవత్సరాలకు పూర్వం నిర్మించినట్లుగా భక్తులు అనుభూతికి లోనయ్యే లాగా రాతి కట్టడాలతో దేవాలయ నిర్మాణం జరిగింది. గర్భాలయాన్ని మునుపటిలాగే ఉంచి దాని చుట్టూరా పటిష్ఠమైన గోడను నిర్మించారు. ఆలయం లోపలికి భక్తులు సులువుగా ప్రవేశించేందుకు ముఖ ద్వారాన్ని వెడల్పు చేయడం జరిగింది.
ఈ దేవాలయ నిర్మాణంలోని ప్రతి అణువులో శ్రీమహావిష్ణువు తత్త్వం గోచరమవుతుంది. రెండవ అంతస్తులో కాకతీయ రీతిని పోలిన స్తంభాలను, అష్టభుజి మండపాలు, మాడవీధులు, పురవీధుల ప్రాకారాలు, మహారాజ గోపురాలు, విమాన గోపురాలు రూపొందించడం జరిగింది. విమానంపైన కేశవ మూర్తుల ఆకారాలు, గరుత్మంతులు, సింహాలు, శిఖరం, అష్టకోణాకృతి ఉంటాయి.

ఆలయంలో నిర్మించిన అష్టభుజి ప్రాకార మండపం చాలా అరుదైనది. ఈ అష్టభుజి ప్రాకార మండపం పై భాగంలో ఏర్పాటు చేయబడిన సాలహారం భక్తులకు కనువిందు చేస్తుంది. నవనారసింహులు, కేశవమూర్తులు, అష్టదిక్పాలకులు, అష్టలక్ష్మీ, దశావతారాలు, వైష్ణవ విగ్రహాలు ఆళ్వారుల విగ్రహాలు చూపరులను ఆకట్టుకుంటాయి.

తూర్పు రాజగోపురం గుండా ప్రధానాలయంలోకి ప్రవేశించే మార్గంలో, ఆలయంలోని గోడల రెండువైపులా శంఖ చక్ర నామాలు, ఏనుగుల వరుసలు, గరుత్మంతుడు, హనుమంతుడు, సుదర్శనమూర్తి, యోగ నారసింహుడు, గర్భాలయ గోడకు పంచ నారసింహ రూపాలు, పడమర ద్వారానికి ఇరువైపులా చండ ప్రచండ విగ్రహాలు గలవు.

ఆలయ ద్వారాన్ని విస్తరించడమే కాకుండా ప్రధాన గర్భాలయ ద్వారాలకు రాగిపై బంగారు పూత పూసి, బంగారు రేకులను అమర్చారు. గర్భాలయ ముఖ మండపంపై ప్రహ్లాద చరిత్రను చూడవచ్చు.

ప్రత్యేక మండపాలు-యాగశాల

ప్రధానాలయంలో లోపలి వైపు గల ప్రాకారంలో నాలుగు దిక్కులా నాలుగు మండపాలను నిర్మించారు. ఈశాన్యంలో కళ్యాణ మండపం, వాయవ్యంలో అద్దాల మండపం, నైరుతిలో యాగశాల, ఆగ్నేయంలో దీపాలంకరణ మండపం గలవు. భక్తులు స్వామి వారి కొరకు నిర్వహించబడే నిత్య కల్యాణ కార్యక్రమాలు కల్యాణ మండపంలో నిర్వహిస్తారు. స్వామివారికి మరియు అమ్మవారికి సంబంధించిన ప్రత్యేక సేవలు, అమ్మవారికి ఊంజల్ సేవ మొదలైనవి అద్దాల మండపం లో నిర్వహిస్తారు. శ్రీ సుదర్శన నారసింహ హోమం యాగశాలలో నిర్వహిస్తారు. ఆగ్నేయంలో గల దీపాలంకరణ మండపంలో నిత్యం దీపాలు వెలిగిస్తారు.

క్షేత్రంలోని పడమటి రాజగోపురం ముందు భాగంలో వేంచేపు మండపం నిర్మించారు. స్వామివారి సేవలు జరిగేటప్పుడు, ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా జరిగే ఊరేగింపు కార్యక్రమాలప్పుడు ఈ మండపంలో భక్తుల దర్శనార్ధం కొద్ది సేపు స్వామివారిని అధిష్ఠింపజేస్తారు. తూర్పు రాజగోపురం ముందు భాగంలో బ్రహ్మోత్సవ మండపాన్ని ఏర్పాటు చేశారు. స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో ఈ మండపాన్ని ఉపయోగిస్తారు. ఉత్సవ మూర్తులను బ్రహ్మోత్సవ మండపంలో అధిష్ఠింపచేసి ఉత్సవ కార్యక్రమాలను జరుపుతారు.

విష్ణువుకు అత్యంత ప్రియ భక్తులు, వైష్ణవ భక్తి మార్గ ప్రచారకులైన పన్నెండు మంది ఆళ్వార్ల విగ్రహాల కొరకు ప్రధాన ఆలయంలో ప్రత్యేంగా ఒక మండపాన్ని నిర్మించి అందులో పన్నెండు స్తంభాలపై నిలువెత్తు విగ్రహాలుగా చెక్కినారు. ఈ విధమైన ఆళ్వార్ విగ్రహాలు స్తంభాలపై నిలబడి ఉండడం ఇతర ఏ వైష్ణవ ఆలయంలోనూ కనిపించక పోవడం, యాదాద్రి ఆలయంలో ఉండడం విశేషం. .

వైకుంఠద్వారం

ఆలయానికి మెట్ల మార్గం మొదలయ్యే ప్రాంతంలోనే వైకుంఠద్వారం ఉంటుంది. ఎటువంటి వాహన సౌకర్యాలు లేని కాలంలో కొండపైకి నడకమార్గం ద్వారా వెళ్లేందుకు రాళ్లతో మెట్ల మార్గాన్ని అప్పటి భక్తులే ఏర్పాటు చేసుకున్నారు. చాలా రోజుల వరకు ఈ మెట్ల మార్గం గురించి సాధారణంగా ఎవరికీ తెలిసేది కాదు.

సున్నం-బెల్లం మిశ్రమంతో రాతికట్టడాలు

పూర్వ కాలంలోని ప్రాచీన ఆలయ నిర్మాణాల్లో డంగు సున్నం, కరక్కాయ, బెల్లం, కలబంద, జనపనారల సమపాళ్ళ మిశ్రమాన్ని ఉపయోగించేవారు. ఈ విధమైన మిశ్రమాన్నుపయోగించిన నిర్మాణాలు దీర్ఘకాలం పటిష్టంగా ఉంటాయని, సాంప్రదాయ రీతిని అనుసరించి యాదాద్రి ప్రధానాలయ రాతి కట్టడాల్లో ఈ మిశ్రమాన్నే ఉపయోగించారు.

Yadagirigutta Temple History In English

Lord Srimannarayana, who broke the pillar to save the devotee who had taken refuge in Krit Yuga, appeared on the Yadagirigutta in Kali Yuga in the form of Pancha Narasimha. Sri Lakshminarasimhaswamy is standing in Yadadri, the divine shrine, protecting those who believe that he is everything. In Telangana this field is popularly known as Yadagiri Gutta. Such a glorious shrine is located in Yadadri Bhuvanagiri district of Telangana state.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *