Thousand Pillar Temple History In Telugu and English

కాకతీయుల కాలంలో నిర్మించబడిన ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ జిల్లాలో కలదు. కాకతీయ చక్రవర్తి రుద్రదేవుడు (ఇతడే మొదటి ప్రతాపరుద్రుడు, కాకతి రుద్రుడు) క్రీ.శ.1163 సంవత్సరంలో ఈ దేవాలయాన్ని నిర్మించాడు. ఇతడి పేరుమీదగానే ఈ ఆలయం రుద్రేశ్వర దేవాలయంగా ప్రసిద్ది చెందింది. ఇందులో లింగ రూపంలో ఉన్న రుద్రేశ్వర దేవుడితో పాటు విష్ణు భగవానుడు, సూర్యదేవుడు కూడా కొలువై ఉంటారు. మండపానికి మూడు వైపులా మూడు గర్భగుడులుండడం వలన ఈ ఆలయాన్ని త్రికూటాలయంగా పిలుస్తారు. వేయిస్తంభాలు కలిగిన మండపాన్ని ఈ దేవాలయంలో నిర్మించడం వలన వేయిస్తంభాల గుడి అని కూడా పిలుస్తారు. ఈ ఆలయ పోషణార్ధం రుద్రదేవుడు మద్దిచెఱువుల గ్రామాన్ని దానంగా ఇచ్చాడని వేయిస్తంభాల గుడి శాసనం ద్వారా తెలుస్తున్నది. రుద్రదేవుడి అనంతరం అతని సంతతి అయిన గణపతి దేవుడు, రుద్రమదేవి, రెండవ ప్రతాపరుద్రుడు వారి వారి పరిపాలనా కాలాల్లో ఈ ఆలయాభివృద్ధికి ఎటువంటి ఆటకం లేకుండా చూశారు.

History of Thousand Pillar Temple In Telugu

ఓరుగల్లు ప్రాంతాన్నేలిన కాకతీయుల కాలంలో జైనంతో పాటు శైవ, వైష్ణవ మతావలంబీకుల మధ్య తరచుగా ఘర్షణలు జరుగుతుండేవి. ప్రతి వర్గంవారు సమాజంలో తమ ప్రాబల్యం కోసం పాకులాడుతూ ఉండేవారు. ప్రజలు మతాలకు అతీతంగా మెలుగుతూ, సామరస్య భావనతో జీవించాలనే సంకేతాన్నివ్వడానికి ఒక త్రికూట ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించి రుద్రేశ్వర ఆలయాన్ని నిర్మించడం జరిగిందని శాసనాల ఆధారంగా తెలుస్తున్నది.
ఆలయ నిర్మాణ వివరాలు

కాకతీయ ప్రభువుల కళాపిపాసకు నిదర్శనమైన ఈ దేవాలయం చాళుక్యుల శైలిలో నిర్మించబడినది. పశ్చిమాన శ్రీరుద్రేశ్వరాలయం, ఉత్తరాన విష్ణు ఆలయం, తూర్పున సూర్యదేవాలయం నిర్మించబడి ఉన్నవి. ఈ ఆలయాలకు ఉపపీఠం, పైకప్పు, రంగమండపం, ముఖమంటపం మొదలైనవి ఒకటే ఉండే విధంగా నిర్మించడం విశేషం. రుద్రేశ్వరుడు కొలువై ఉన్న పీఠం నక్షత్రాకారంలో ఉంటుంది. ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ హయాంలో ఓరుగల్లుపై జరిగిన దండయాత్రల్లో వైష్ణవ, సూర్యదేవాలయాల విగ్రహాలు ధ్వంసం కాగా కేవలం రుద్రేశ్వర ఆలయం మాత్రమే పూర్తిగా మిగిలింది.
శిల్పకళా నైపుణ్యం

ఆలయంలో ప్రతి అణువు శిల్పకళా సౌందర్యంతో నిండి వీక్షకులను అచ్చెరువొందిస్తుంది. నటరాజు, దక్షప్రజాపతి, పార్వతిదేవి, ప్రమథగణాల శిల్పాలు అంతరాళద్వారం పైభాగంలో చెక్కబడి ఉంటాయి. గర్భగుడి ద్వారశాఖల్లో పూర్ణకుంభం ధరించిన వనిత, ద్వారపాలకులు, చామరగ్రాహిణి, పొడవుగా ఉన్న చేపను చేతిలో ధరించిన వ్యక్తి మొదలైన శిల్పాలు ఉంటాయి. దీనికి పైభాగంలో వీర్నం, కంచు ఢంక, పలక, వాయువీణ, బూరవాద్యాలు ధరించిన వాద్యగాళ్లు, మాలధారులు మొదలైన శిల్పాలను చూస్తే అవి భగవంతుడి సుప్రభాత సేవలో ఉన్నట్లు అనిపిస్తుంది. సింహవరుసలు, గొలుసులు, రుద్రాక్షహారాలు, లతలు, కీర్తిముఖహారాలు కనిపిస్తాయి. ఆలయ మంటపం పైభాగంలో కొలువుదీరిన రామాయణ, మహాభారత ఇతిహాస ఘట్టాల విగ్రహాలు కాకతీయుల కాలంలోని శిల్పకళా నైపుణ్యాన్ని వీక్షకులకు తెలియచేస్తాయి. ఆలయంలో నైరుతి భాగంలో ఒక అలసకన్య శిల్పం ఉంటుంది. కాకతీయ రాజ్యం ప్మీద జరిగిన ముష్కరుల దాడిలో ఆమె అందమైన ముఖం ధ్వంసమైపోయింది.

ఆలయం చూట్టూ ఉన్న ఉపానం ఒక వేదికలాగా విస్తరించి ఉన్నది. మండపాల ముందు భాగంలో అర్ధ మండపాలు, లోపలి భాగంలో స్తంభాలు, కుడ్యస్తంభాలు, బోధికలు, బోధికలపై నాట్యభంగిమలో శిల్పాలు, అధిష్టాన ఉపపీఠం, గోడల బయటివైపు భాగాలు మొత్తం గ్రానైట్ రాతితో నిర్మించగా, గోడల లోపలి స్తంభాలు, ద్వారబంధాలు మొదలైనవి మాత్రం అద్దంలాగా మెరుస్తూ అందంగా కనిపించే బసాల్ట్ రాతితో నిర్మించబడినవి. ఈ బసాల్ట్ రాయిపై చెక్కబడిన శిల్పాలు, లతల్లో ఆ కాలం నాటి శిల్పుల పనితనం కనిపిస్తుంది. ద్వార బంధాలకు ఇరువైపులా జాతి కిటికీలు ఏర్పాటు చేయబడినవి. లతలు, చిత్రాల అలంకరణతో కూడిన ద్వారశాఖలు చూపరులకు కనువిందు చేస్తాయి.

Interesting Facts About Thousand Pillar Temple – ఆలయ ప్రత్యేకతలు

రుద్రేశ్వరాలయంలో నిర్మించిన గోడలు ఎక్కడా అతికించనట్లుగా గానీ, గీతలు గీయబడిగానీ లేకుండా ఏకశిలతో నిర్మించినట్లుగా కనిపిస్తాయి. ఇటువంటి నిర్మాణం అప్పటి శిల్పుల కళా నైపుణ్యానికి నిదర్శనంగా గోచరిస్తుంది. దేవాలయ ముఖ మంటపం దక్షిణం వైపున ఉంటుంది. ఇందులో నుండి లోనికి ప్రవేశించగానే పదహారు స్తంభాలతో కూడిన చతురస్రాకార నిర్మాణం కనిపిస్తుంది. వీటిలో అత్యంత అందంగా రూపొందించబడిన నాలుగు స్తంభాల మధ్యన రంగమండపం ఉంటుంది. క్షేత్ర పాలకుడిగా జానెడు పరిమాణంలో ఆంజనేయస్వామి ఆలయ బలిపీఠానికి ఆగ్నేయం వైపున లోపలి భాగంలో ప్రతిష్టించబడి ఉంటాడు.

రుద్రేశ్వరాలయానికి కుడి భాగంలో ఒక చేతిలో కల్వము, మరొక చేతిలో నూరే రాయి ధరించిన వైద్యగణపతి నైరుతి మూలలో మహాగణపతిగా దర్శనమిస్తాడు. ఈ గణపతిని దర్శించిన భక్తులు ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లుతారనే విశ్శాసం కలదు. కళ్యాణ మంటపానికి, ప్రధానాలయాలకు మధ్యభాగంలో, ఆలయ ముఖ మండపానికి ఉత్తరాభిముఖంగా నందీశ్వరుడి విగ్రహం ఒకటి ప్రతిష్టించబడి ఉంటుంది. నల్లరాతితో చెక్కబడిన ఈ విగ్రహం వీక్షకులను అబ్బుర పరిచేలాగా ఉంటుంది. ఆలయ ఈశాన్య భాగంలో ఉండే కోనేరులో ఇప్పటికీ నీరు నిలువ ఉండటం విశేషమే. ఈ కోనేటి నీటిలో ఉండే తాబేళ్ళను చూస్తుంటే వరాహావతార ఘట్టం కనులముందు మెదులుతుంది. ఆలయానికి పడమరన ఉన్న రావిచెట్టు క్రింద ప్రసన్నాంజనేయస్వామి కొలువుదీరి ఉంటాడు. స్వామికి ప్రతి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ దేవాలయంలో శనీశ్వరునికి ప్రత్యేక పూజలు చేసి, ఆ తరువాత రుద్రేశ్వరుణ్ణి దర్శించుకుంటే శని పీడా ప్రభావం నుండి ముక్తి పొందవచ్చని భక్తులు విశ్వసిస్తారు. శనిగ్రహ ప్రభావ పీడితులు ప్రతి శనిత్రయోదశి రోజు ఉదయం 5 గంటల నుంచి జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొని పీడా పరిహారం పొందుతారు.

త్రికూటాలయానికి దక్షిణం వైపున గల కళ్యాణ మండపంలో కాకతీయుల కాలంలో ఏవైనా ఉత్సవాలు జరిగినప్పుడు కళ్యాణోత్సవాలు, వీరుల నృత్యాలు, రాజసందర్శన సమయంలో సభలు జరిపేవారు. ప్రస్తుతం కళ్యాణమండపం జీర్ణోద్ధరణ దశలో ఉన్నది.

Thousand Pillar Temple History – రహస్య సైనిక కార్యకలాపాలలో భాగంగా ఒకచోటి నుంచి మరొక చోటికి ప్రయాణించడానికి వీలుగా ఏర్పాటు చేయబడిన కాకతీయ సామ్రాజ్యానికి చెందిన రహస్య స్థావరాలను కలుపుతూ భూ అంతర్భాంగం నుండి వేయబడిన రహస్య మార్గానికి సంబంధించిన ప్రధాన ద్వారం ఒకటి ఈ దేవాలయంలో కలదు. ప్రస్తుతం ఈ రహస్య మార్గాన్ని మూసివేయడం జరిగింది.
శిలాశాసనం

Thousand Pillar Temple History – రుద్రేశ్వరాలయానికి తూర్పున గల ద్వారం వద్ద కాకతీయ ప్రభువులు వేయించిన శిలాశాసనం ఒకటి ఉన్నది. సుమారు పదకొండు అడుగుల పొడవుండి నల్లనిశిలతో తయారుచేయబడిన ఈ శిలాశాసనం పతాకస్థానంలో కాకతీయ రుద్రదేవ మహారాజు శ్రీరుద్రేశ్వర మహాశివలింగాన్ని అర్చిస్తున్నట్లుగా చిత్రించబబడి ఉంటుంది. దానికి పక్కనే నందీశ్వరుడిని చిత్రించారు. రుద్రేశ్వరుడు, కేశవుడు, సూర్యనారాయణుల నమూనాలు శాసనానికి మూడువైపులా కనిపిస్తాయి. ఇదే శాసనంలో రెండవ ప్రోలరాజు శౌర్యపరాక్రమాలు విజయ యాత్రలకు సంబంధించిన వర్ణనలు కూడా కనిపిస్తాయి.

Thousand Pillar Temple History – రుద్రేశ్వరునికి జరిపే నిత్య పూజలు

ఈ దేవాలయంలో ప్రతిరోజు ఉదయం 6 నుండి రాత్రి 8 గంటల వరకు రుద్రేశ్వరుడి సందర్శనకు భక్తులను అనుమతిస్తారు. రాత్రి 8 గంటల సమయంలో మహా హారతి కార్యక్రమం కన్నుల పండుగగా జరుగుతుంది. తొలిఏకాదశి, శ్రావణమాసంలో పలు ఉత్సవాలు, గణపతి నవరాత్రులు, దేవీ శరన్నవరాత్రుత్సవాలు, కార్తీక మాసోత్సవాలు, మహాశివరాత్రి పర్వదినోత్సవాలు, ఉగాది మహోత్సవం, శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణ వేడుకలు, హనుమాన్ జయంతి మొదలైన వేడుకలు రుద్రేశ్వరాలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

Thousand Pillar Temple Reconstruction Facts – ఆలయ పునర్నిర్మాణం

రుద్రేశ్వరాలయానికి ముందు భాగంలో గల మండపంలో కొన్ని స్తంభాలు పట్టును కోల్పోయి కదులుతూ ఉండడం వలన ఆలయాన్ని పునర్నిర్మించాలని ప్రభుత్వం సూచనలు చేసింది. ఆనాటి కాకతీయ ప్రభువుల వారసత్వ సంపదను గురించి భావితరాలకు తెలియజేయాలనే సదుద్దేశ్యంతో ఇంతటి ఘన కీర్తిని కలిగిన ఆలయాన్ని పునర్నిర్మించాలని సంకల్పించారు.
తరాలు మారినా కాకతీయ కళావైభోగానికి నిదర్శనంగా వేయి స్తంభాల గుడి మాత్రం ఇంకా మనుగడలో ఉండడం విశేషంగా పరిగణించవచ్చు. దీనికి ముఖ్య కారణం ఆ కాలంనాటి వాస్తుశిల్పుల పనితనం, నేర్పరితనమే. ముష్కరుల దండయాత్రను సైతం తట్టుకుని నిలబడిన రుద్రేశ్వరాలయం చరిత్రలో అజరామరంగా నిలిచిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

Final Overview About Thousand Pillar Temple

రుద్రేశ్వరాలయం కేవలం ఆధ్యాతిక ఆలయంగానే కాకుండా ప్రపంచస్థాయి పర్యాటకులను ఆకర్షిస్తున్న వేయిస్తంభాల గుడిగా కూడా చారిత్రక విశిష్టతను సంతరించుకున్నది. 19వ, 20వ శతాబ్దాలలో విదేశీ పర్యాటకులచే విశేషంగా సందర్శించబడిన ప్రదేశంగా నమోదు చేయబడింది. ఇతటి విశిష్టతను కలిగిన ఆలయం తెలంగాణలో ఉండడం తెలంగాణ వాసులకు గర్వకారణం.