Rudramadevi History in Telugu
తెలంగాణ తొలి మహిళా పాలకురాలు వీరనారి రుద్రమదేవి
దక్షిణ భారతదేశ మధ్యయుగ చరిత్రలో తెలంగాణను పరిపాలించిన మొదటి మహిళా పాలకురాలిగా రుద్రమదేవి ఘనత వహించింది. జన్మతః స్త్రీ అయినప్పటికీ పురుష వేషధారణ ధరించి రుద్రదేవ మహారాజు అనే పేరుతో కాకతీయ సింహాసనాన్ని అధిష్టించి గొప్ప పరిపాలనాదక్షురాలుగా, యుద్ధనైపుణ్యాలను కలిగిన వీరనారిగా రుద్రమదేవి గణతికెక్కింది. గణపతిదేవ చక్రవర్తి, సోమాంబలు రుద్రమదేవి తల్లిదండ్రులు. కాకతీయ చక్రవర్తులలో ప్రముఖుడైన గణపతి దేవుడికి మగ సంతానం లేని కారణంగా రుద్రమ దేవిని తన కొడుకుగ భావించి ఆమెకు గుర్రపు స్వారీ, సైనిక శిక్షణ, రాజనీతి తంత్రాలు నేర్పించి తన తరువాత కాకతీయ సామ్రాజ్య భారాన్ని అప్పగించాడు. రాజ్య వ్యవహారాల్లో చురుకుగా పాల్గొంటున్నప్పటికీ రుద్రమదేవి క్రీ.శ. 1269 వరకు కాకతీయ రాజ్య కిరీటాన్ని ధరించలేదు. పాండ్యులతో జరిగిన ముత్తుకూరు యుద్ధం తరువాత గణపతి దేవుడు క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుని రుద్రమకు పట్టాభిషేకం చేశాడు. రుద్రమదేవి భర్త నిడదవోలు పాలకుడైన చాళుక్య వీరభద్రుడు. ఈ దంపతులకు ముమ్మడమ్మ, రుద్రమ్మ, రుయ్యమ్మ అనబడే ముగ్గురు కుమార్తెలు జన్మించారు. ఆధారాలు క్రీ.శ. 1262 నుండి 1289 వరకు సాగిన రుద్రమదేవి పాలనకు సంబంధించిన విశేషాలు తెలుసుకోవడానికి సమకాలీన రచనలు, ఆమె హయాంలోని అధికారులు వేయించిన శాసనాలు మరీ ముఖ్యంగా ఆమె పరిపాలనా కాలంలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించిన వెనీస్ యాత్రికుడు మార్కోపోలో రచనలు ముఖ్యమైన ఆధారాలుగా పరిగణించదగినవి. మార్కోపోలో మోటుపల్లి ఓడరేవులో అడుగుపెట్టిన నాటినుండి తిరుగు ప్రయాణమయ్యే దాకా రుద్రమదేవి పాలనకు సంబంధించిన అనేక అంశాలను పూసగుచ్చినట్టుగా వివరించాడు. రుద్రమ శక్తిసామర్థ్యాలను గురించి, రాజ్యంలో జరుగుతున్న వ్యాపార వ్యవహారాలు, ఎగుమతి-దిగుమతులు, ఓడరేవులో అధికారులు నిర్వర్తించే విధులు, విదేశీ వర్తకుల కోసం, బాటసారుల సంరక్షణకు రుద్రమదేవి చేపట్టిన ఏర్పాట్లు మొదలైన అంశాలను కళ్ళకు కట్టినట్టు తెలుపుతూ కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని తన రచనలలో ప్రశంసించాడు.
రాజ్య స్థితిగతులు
రుద్రమదేవి రాజ్య పరిపాలనా పగ్గాలు చేపట్టే నాటికి కాకతీయ సామ్రాజ్యంలో పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉండేవి. గణపతిదేవుడు రుద్రమకు రాజ్యపాలన అప్పగించడం, ఒక స్త్రీ తమను పరిపాలించడం సహించని కొందరు రాజ బంధువులు, సామంతులు తిరుగుబాటు లేవనెత్తారు. రుద్రమదేవి సవతి సోదరులైన హరిహర దేవుడు, మురారి దేవుడు ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించగా రేచర్ల ప్రసాదాదిత్యుడి ఆధ్వర్యంలోని రుద్రమదేవి సేనలు వారిని అణిచినట్లు ప్రతాపరుద్ర చరిత్ర ద్వారా తెలుస్తున్నది. మరోవైపు సామంతరాజులు, రాష్ట్ర పాలకులు కూడా తిరుగుబాటు చేశారు. ముత్తుకూరు యుద్ధంలో పాండ్యుల చేతిలో కాకతీయ సేనలు పరాజయం చవిచూశాయి. దీనికి తోడు యాదవరాజు మహాదేవుడు కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కాకతీయ రాజ్యాన్ని సంరక్షించే గురుతర బాధ్యతను రేచర్ల ప్రసాదాదిత్యుడు తీసుకున్నాడు. అందుకు గాను ఇతనికి కాకతీయ రాజ్య స్థాపనాచార్య అనే బిరుదు లభించింది. రేచర్ల ప్రసాదాదిత్యుడితో పాటు కాయస్థ జన్నిగదేవుడు, కాయస్థ త్రిపురారి, గోన గన్నారెడ్డి, మల్యాల గుండి నాయకుడు, మాదయనాయకుడు, మహాప్రధాన కందరనాయకుడు మొదలైనవారు రుద్రమదేవికి అండగా నిలిచి కాకతీయ రాజ్యం సుస్థిరం చేయడానికి సహకరించారు.
పొరుగు రాజ్య పాలకుల దండయాత్రలు
కాకతీయ రాజ్యం స్త్రీ ఏలుబడిలోకి రావడం తమకు అనుకూలమని సునాయాసంగా రాజ్యాన్ని దక్కించుకోవచ్చనే ఉద్దేశ్యంతో పొరుగు రాజ్యాల పాలకులైన తూర్పు గాంగులు, యాదవులు, పాండ్యులు కాకతీయ రాజ్యంపై దండయాత్ర చేశారు. కళింగ పాలకుడైన మొదటి నరసింహుడు సైతం కాకతీయ రాజ్యంలో జరుగుతున్న అంతర్గత తిరుగుబాటును ఆసరాగా తీసుకొని కాకతీయ రాజ్యంపై దండయాత్ర చేసి గోదావరి మండలంలోని అనేక ప్రాంతాలు ఆక్రమించుకున్నాడు. అతని తనయుడు భానుదేవుడు వేంగిపై దెండెత్తాడు. పోతినాయకుడు, ప్రోలినాయకుడు అనే సేనాధిపతుల నాయకత్వంలో రుద్రమ ఈ దండయాత్రను విజయవంతంగా ఎదుర్కొని విజయం సాధించింది. గోదావరి నది ఒడ్డున కళింగ సైన్యాన్ని ఓడించడంతో తీరాంధ్ర ప్రాంతం రుద్రమదేవి వశమైనది.
యాదవుల దండయాత్ర
రుద్రమదేవి అంతరంగిక తిరుగుబాట్లు, గాంగ దండయాత్రలతో సతమతమవుతున్న కాలంలోనే యాదవరాజైన మహదేవుడు కాకతీయ రాజ్యంపై దండెత్తి 15 రోజులు ఓరుగల్లు కోటను ముట్టడించాడు. మహదేవుడి సైన్యంతో జరిగిన భీకర యుద్ధంలో రుద్రమదేవి పోరాట పటిమకు తట్టుకోలేక మహాదేవుడు పారిపోయి సంధి చేసుకున్నట్లు తెలియచేసే విజయస్తంభం ఒకటి అక్కడ రుద్రమదేవి వేయించినట్లు ప్రతాపరుద్ర చరిత్ర తెలియజేస్తున్నది. రుద్రమదేవి యాదవరాజు మహాదేవుడిపై సాధించిన విజయానికి చిహ్నంగా రాయగజకేసరి బిరుదు ధరించినట్లు తెలుస్తున్నది. రుద్రమదేవి బీదర్ కట శాసనంలో కూడా రాయగజకేసరి బిరుదు ప్రస్తావన కలదు. అంతే కాకుండా వరంగల్ కోటలో గల స్వయంభూ దేవాలయానికి రంగమంటపం కూడా నిర్మింప చేసింది. యుద్ధంలో పరాజయం పొందిన యాదవ రాజులు కాకతీయ-యాదవ రాజ్యాల మధ్య వైవాహిక సంబంధాల పెంపుదలకు మొగ్గు చూపినట్లు ఇటీవల కాలంలో లభించిన తాళ్ళపాడు శాసనం ప్రకారం తెలుస్తున్నది. యాదవ వంశానికి చెందిన ఎల్లణదేవుడికి రుద్రమదేవి రెండవ కుమార్తె రుద్రమ్మను ఇచ్చి వివాహం చేయడం ఈ విషయాన్ని ధృవపరుస్తున్నది.
కాయస్థ అంబదేవుని తిరుగుబాటు
త్రిపురాంతక, నందలూరు శాసనాల ప్రకారం కడప జిల్లా నందలూరు పాలకుడైన కాయస్థ అంబదేవుడు రుద్రమదేవి అధికారాన్ని ధిక్కరించి తిరుగుబాటు చేశాడు. రుద్రమదేవి అనుయాయుడైన కాయస్థ జన్నిగదేవుడు క్రీ.శ. 1264లో ఆమె ఆజ్ఞానుసారం నందలూరు పరిపాలిస్తున్న సమయంలో అదే ప్రాంతంలో కొనసాగిన పాండ్యుల అధికారాన్ని అంతం చేశాడు. తరువాత కాలంలో జన్నిగదేవుడి తమ్ముడు త్రిపురాంతకుడు ఆ రాజ్యానికి అధిపతిగా రుద్రమదేవికి విధేయుడిగా ఉంటూ పాలించాడు. త్రిపురాంతకుని తరువాత అతని తమ్ముడు అంబదేవుడు అదే రాజ్యానికి పాలకుడై రుద్రమదేవి సార్వభౌమత్వాన్ని అంగీకరించక తిరుగుబాటు లేవనెత్తాడు.
రుద్రమదేవికి వ్యతిరేకులైన పాండ్యులు, యాదవులతో మైత్రి చేసుకోవడం కాకతీయ రాజ్యానికి పెను ప్రమాదంగా పరిణమించింది. రుద్రమదేవి స్వయంగా ఆమె సేనాని మల్లికార్జున రాయలుతో కలిసి తిరుగుబాటును అణచడానికి పూనుకున్నది. క్రీ.శ. 1289 నవంబర్ 27 నాటి చందుపట్ల శాసనం ప్రకారం నెల్లూరు జిల్లా త్రిపురాంతకం వద్ద అంబదేవుడితో జరిగిన యుద్ధంలో రుద్రమదేవి వీరమరణం పొందింది. అయితే సమకాలీన చరిత్రకారులకు ఇంకా రుద్రమదేవి మరణ విషయంలో పరిపూర్ణమైన చారిత్రక అంశాలు లభించలేదు.
రుద్రమదేవి ఘనత
రుద్రమదేవి గొప్ప పరిపాలనావేత్త. సమర్థవంతమైన రాజ్యపాలన చేసింది. కాకతీయ రాజ్య పాలన స్వీకరించిన నాటి నుండి సుభిక్షమైన పాలనతో ప్రజాహితంగా తన పరిపాలనను కొనసాగించింది. శత్రురాజుల దండయాత్రలను సమర్ధవంతంగా తిప్పికొట్టిన వీరనారి. దక్షిణ భారతదేశ చరిత్రలో తొట్టతొలి మహిళా పాలకురాలుగా రుద్రమదేవి చిరస్థాయిగా నిలిచింది.