Ramappa Temple in Telugu – Unknown FACTS

కాకతీయుల కళావైభోగానికి నిదర్శనం రామప్ప దేవాలయం 

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ నగరానికి సుమారుగా 70 కి.మీ. దూరంలో ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో రామప్ప దేవాలయం నెలకొని ఉన్నది. అద్భుతమైన శిల్పకళా సౌందర్యం ఉట్టిపడే ఈ దేవాలయ నిర్మాణం క్రీ.శ. 1213 సం||లో కాకతీయ చక్రవర్తి గణపతిదేవుని కాలంలో అతని సేనాని రేచర్ల రుద్రుని ఆధ్వర్యంలో జరిగింది. ఈ దేవాలయ ప్రధాన రూపశిల్పి అయిన ‘రామప్ప’ పేరుమీదుగానే ఈ ఆలయానికి ‘రామప్ప దేవాలయం’ అన్ని నామకరణం చేశారు. ఒక దేవాలయానికి శిల్పి పేరు పెట్టడం అనేది అసాధారణ విషయం . కానీ ఈ దేవాలయానికి శిల్పి పేరుని పెట్టిన ఘనత కేవలం కాకతీయులదే. రామప్ప ఆలయం ఒక అపూర్వమైన నిర్మాణంగా నిలవడం వెనుక ఆనాటి శిల్పుల నాలుగు దశాబ్దల కఠిన శ్రమ, కృషి ఉన్నది. ప్రతి శిలను రమణీయ శిల్పంగా మలిచి ఒక గొప్ప ఆలయాన్ని దేశానికే గర్వకారణంగా తీర్చిదిద్దారు. ఏకకూఠ శైలిలో నిర్మించిన ఈ దేవాలయం ఈశ్వరుడు కొలువై ఉన్న రుద్రేశ్వరాలయంగా ప్రఖ్యాతి గాంచింది. ఈ ఆలయంలో గల అద్భుత సౌందర్య సంపదతో కూడిన రాతి శిల్పాలతో పాటు శిల్పకళా స్తంభాలు చూపరులను ఇట్టే కట్టిపడేస్తాయి. దేవాలయ నిర్మాణ విశేషాలు తెలిపే శాసనాన్ని ఆలయానికి ఈశాన్య భాగంలో గల మండపంలో ప్రతిష్టించారు. ఈ ఆలయంలో గల నాలుగు మూలల్లో నాలుగు పరివార దేవతా గృహాలు నిర్మించబడినవి. ఇందులో గల రుద్రేశ్వరాలయం కాకతీయుల శిల్పకళకే కాకుండా మధ్యయుగంలో నిర్మించబడిన దక్కన్ దేవాలయాలన్నిటికీ మకుటాయమానమైనదని చరిత్రకారుల అభిప్రాయం. రుద్రేశ్వరాలయానికి వాయువ్యంగా దేవీ ఆలయం, నైరుతి దిశలో యోగనర్సింహ ఆలయం నిర్మితమై ఉన్నవి. 

ఆలయ నిర్మాణ విశిష్టత 

సాధారణంగా కాకతీయ దేవాలయాల నిర్మాణం త్రికూఠ శైలిలో ఉంటే రామప్ప దేవాలయం మాత్రం కాకతీయ శైలికి భిన్నంగా ఏక కూఠ శైలిలో నిర్మితమైనది. ఆలయానికి మూడు ప్రవేశ ద్వారాలు కలవు. ఎత్తైన పీఠంపైన నక్షత్ర ఆకారంలో, తూర్పు దిశకు అభిముఖంగా ఆలయం నిర్మించబడినది. ఆలయానికి ఉత్తర, దక్షిణ దిశలలో కూడా ప్రవేశ ద్వారాలు నిర్మించబడినవి. ఆలయ మధ్యభాగంలో మహామంటపం నిర్మించారు. మహా మంటపంలో విస్తృత వివరాలతో చెక్కబడిన నాలుగు స్తంభాలు కలవు. ఆలయ మధ్యభాగం పైకప్పులో సున్నితమైన చిత్రీకరణతో శివ పురాణ చిత్రాలను, అక్కడి నుండి మహా మండపంలోనికి తెరుచుకునే గర్భగుడి ప్రధాన ద్వారానికి సమానంగా అందమైన దృశ్యాలెన్నో చెక్కబడినవి. ఆలయ గోడలు, స్తంభాలు వేటిని చూసినా హిందూ పురాణాలను కళ్ళకు కట్టినట్లుగా తెలిపే రకరకాల ఘట్టాలకు సంబంధించిన శిల్పాలు అత్యంత రమణీయంగా గోచరిస్తాయి. వీక్షకులు వీటిలో ఎన్నో గాధలను తిలకించవచ్చు. ఆలయ ప్రాంగణంలో అలంకరణకోసం జల చరాలు, కమలాలు, జంతువులు, పక్షుల శిల్పాలు చిత్రించబడినవి. భక్తులు ప్రదక్షిణలు చేసుకోవడానికి తగినంత స్థలాన్ని కలిగి ఉండడం ఈ ఆలయం ఆకారం యొక్క ప్రత్యేకత. 

శిల్పకళా నైపుణ్యత 

ఆలయంలోని మండపంలో గల స్తంభాలు కాకతీయులకు పూర్వం పాలించిన కళ్యాణి చాళుక్యులు, హోయసాల స్తంభాల పోలికను కలిగి ఉన్నాయి. ఎరుపురంగు ఇసుక రాతితో నిర్మించిన ఈ ఆలయంలో స్తంభాలు, ద్వార బంధాలు, శిల్పాలు నల్లటి బసాల్ట్ రాతితో నిర్మించబడినవి. కాకతీయులు నిర్మించిన దేవాలయాల ద్వార నిర్మాణాలకు ఇవి తలమానికమైనవి. స్తంభం మధ్యభాగంలో ఘనచతురస్రాకారంలో ఉండి పై భాగంలో సంగీత, నాట్యభంగిమలతో మదనికలనబడే శిల్పాలు చెక్కబడి ఉన్నవి. మరికొన్ని స్తంభాలపైన కదంతొక్కుతున్న సింహాలు; సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనాలుగా నిలిచే శిల్పాలు కొలువుదీరి ఉన్నాయి. ఈ శిల్పాలలో కొన్ని అసాధారణమైనవిగా కనిపిస్తాయి. కాకతీయ గజసాహిణి అయిన జాయప సేనాని రచన నృత్యరత్నావళిలోని నాట్యశిల్ప వర్ణన రామప్ప గుడిలోని శిల్పాలలో తొణికిసలాడుతూ ఉంటుంది. భరతనాట్యంలోని భంగిమలతో కూడిన శిల్పాలను ఆలయ స్తంభాలమీదా, పైకప్పులమీదా దర్శించవచ్చు. భారతీయ శాస్త్రీయ నృత్యాలలో భాగమైన దయ వ్యక్తీకరణ, పరిపూర్ణ భంగిమలు, వివిధ రకాల ముద్రలు; కాకతీయుల కాలానికి సంబంధించిన నృత్య నాటకమైన పేరిణి నృత్య భంగిమలను ఈ దేవాలయంలో శిల్పాల రూపంలో తీర్చిదిద్దారు. ప్రతి శిల్పంలో ఆనాటి శిల్పుల సృజనాత్మకత ఉట్టిపడుతుంది. మధ్యయుగ కాలంలో జరిగిన ఢిల్లీ సుల్తానుల దంద్రయాత్రల కారణంగా ఆలయంలోని పలు కళాఖండాలు దెబ్బ తిన్నప్పటికి ఇంకా ఇప్పటికీ కొన్ని శిల్పాలు చెక్కు చెదరకుండా ఉండడం విశేషం. 

నంది విగ్రహం ప్రత్యేకత 

రామప్ప దేవాలయంలో గల మరోక విశేషం చూపరులను ఆకట్టుకునే నల్లని రాతితో చెక్కబడిన నంది విగ్రహం. దీనిని చూస్తున్న సందర్శకులను ఎల్లప్పుడూ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. శివుడికి ఎదురుగా ఉన్న ఈ నంది ఈశ్వరాజ్ఞ కోసం ఎదురు చూస్తున్నట్లు తన చెవిని లింగంవైపే ఉంచి ముందుకు లంఘించేందుకు సిద్ధమైనట్లుగా తీర్చిదిద్దబడినది. వీక్షకులు ఎటువైపు నుంచి చూసినా వారినే చూస్తున్నట్లు నంది విగ్రహాన్ని చెక్కిన శిల్పి నైపుణ్యం కొనియాడదగినది. 

నిర్మాణ సాంకేతికత 

ఆలయ నిర్మాణంలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఎంతో తేలికగా ఉండి నీటిపై తేలియాడే ఇటుకలను ఆలయ నిర్మాణానికిగాను ఉపయోగించడం. ఈ ఇటుకల నిర్మాణంలో ఆనాటి శిల్పులు ఉపయోగించిన సాంకేతికత ప్రతి ఒక్కరినీ అబ్బురపరిచేదిలాగా ఉంటుంది. భూకంపాల కారణంగా కట్టడాలకు నష్టం కలగకుండా నిరోధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న నేటికాలం కంటే ముందుగానే 13 వ శతాబ్దంలో కాకతీయ కాలంనాటి శిల్పులు రామప్ప ఆలయ నిర్మాణంలో భూకంప నిరోధక నిర్మాణానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని ఉపయోగించడం విశేషం. ఆలయ నిర్మాణంలో వినియోగించిన అద్భుతమైన ఇసుక పెట్టె సాంకేతికత నాటి శిల్పుల నైపుణ్యాన్ని ప్రస్ఫుటిస్తుంది. ఆలయ నిర్మాణ సమయంలో పునాదులలో గల ఖాళీల మధ్యలో ఇసుకను నింపడం ద్వారా భూకంపాల ధాటికి ఆలయ నిర్మాణం దెబ్బతినకుండా నిర్మించడం విశేషం. ఎన్ని భూకంపాలు వచ్చినా నేటికి కూడా ఈ ఆలయం చెక్కుచెదరకుండా ఉండడం ఆనాటి శిల్పుల దార్శనికతకు నిదర్శనం. సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాల ఉపయోగం తెలియని కాలంలోనే ఇంతటి గొప్పదైన చారిత్రక కట్టడాన్ని నిర్మించడం నిజంగా అసాధారణమైన విషయమే. 

సరస్సు నిర్మాణం 

కాకతీయుల కాలంలో వాస్తుశిల్పులు కేవలం శిల్పులే కాకుండా అద్భుతమైన పనితనం కలిగిన ఇంజనీర్లు కూడా. రామప్ప సరస్సు నిర్మాణం వారి ఇంజనీరింగ్ పని తనానికి నిదర్శనం. ఈ సరస్సు పూర్తి చతురతతో సృష్టించబడింది. కొండలను అర్ధ వృత్తాకారంగా గొలుసులతో చుట్టిన ప్రాంతాన్ని తవ్వి జలాశయ నిర్మాణం చేయడం ద్వారా సహజమైన మట్టి ఆనకట్టతో పాటు పెద్దఎత్తున పరీవాహక ప్రాంత ఏర్పాటు చేశారు. ఈ నిర్మాణం ద్వారా నేటికీ రైతుల పొలాలకు సాగునీరు అందుతున్నది. రామప్ప దేవాలయం కాకతీయుల కళాత్మక దృష్టికి, అమోఘమైన శిల్పసంపద, నైపుణ్యతలకు నెలవుగా నిలచింది. ఇంతటి విశిష్టతను కలిగిన వారసత్వ సంపదను భావితరాలకు అందించిన కాకతీయ చక్రవర్తులు సదా స్మరణీయులు. 

యునెస్కో వారసత్వ హోదా 

ఇంత గొప్ప చారిత్రక మరియు సాంకేతిక అంశాలతో మిళితమై ఉన్న రామప్ప దేవాలయాన్ని వారసత్వ సంపదగా గుర్తించాల్సిందిగా అభ్యర్థిస్తూ యునెస్కో హెరిటేజ్ కమిటీకి భారత ప్రభుత్వం ప్రతిపాదనలు పంపగా 2021 జులైలో రామప్ప దేవాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదాను ప్రకటించింది. సుమారు 800 సంవత్సరాలకు పూర్వం నిర్మించబడిన ఈ అపురూపమైన కట్టడానికి ప్రపంచస్థాయి గుర్తింపు లభించడం తెలంగాణ వాసులకే కాకుండా భారతీయులందరికీ గర్వకారణం.