Alampur Jogulamba Temple History – Know The Real Facts

తెలంగాణలోని జోగులాంబ-గద్వాల జిల్లాలో పవిత్ర తుంగభద్రా నదీ తీరాన శక్తి స్వరూపిణిగా కొలువై ఉన్న జోగులాంబ అమ్మవారి దేవాలయం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠంగా, మహిమాన్వతమైన క్షేత్రంగా విరాజిల్లుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో గల అత్యంత పురాతన ప్రాచీన ఆలయాల్లో ఈ దేవాలయం కూడా ఒకటి.

చారిత్రక పరంగా రాష్ట్రంలో గల శైవ క్షేత్రాలన్నింట్లో అలంపూర్ కు ఒక విశిష్టత కలదు. దక్షిణ కాశీగా, శ్రీశైల క్షేత్రానికి పశ్చిమ ద్వారంగా ఈ క్షేత్రం వెలుగొందుతున్నది… పాల్కురికి సోమనాథుడి పండితారాధ్య చరిత్ర, స్కంధ పురాణాలలో ఆలంపూరు హాలంపురం, బ్రహ్మేశ్వరి భాస్కరక్షేత్రం, పరశురామ క్షేత్రం, హేమలాపురంగా పేర్కొనడం జరిగింది. కాకతీయ శాసనంలో ‘హటంపుర’గా చెప్పబడినది. హేమలాంపురంగా పిలువబడిన ఈ ఆలయం పేరు కాలక్రమంలో రూపాంతరం చెందుతూ హతంపురం, యోగులాపురం, జోగుళాపురం చివరికి అలంపురంగా మార్పు చెంది నేడు ఆలంపూర్‌ గా పిలువబడుతున్నది. ఆలంపూర్ జోగులాంబ దేవాలయం 6వ శాతాబ్దంలో బాదామి చాళుక్య వంశానికి చెందిన రెండవ పులకేశి తెలంగాణను పరిపాలిస్తున్న కాలంలో నిర్మించబడినట్లు చారిత్రక ఆధారాల వలన తెలుస్తున్నది. వెసర శైలిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. 

స్థల పురాణం

దక్షయజ్ఞానికి వెళ్ళి భంగపడి, ఆత్మాహుతికి పాల్పడిన సతీదేవి మృత శరీరాన్ని లోక కళ్యార్ధం విష్ణుమూర్తి సుదర్శన చక్రంచేత ఖండిచగా పద్దెనిమిది భాగాలుగా విభజించబడి వేర్వేరు ప్రాంతాల్లో పడగా, ఆది శంకరాచార్యుల వారు వాటిని పద్దెనిమిది శక్తి పీఠాలుగా గుర్తించి ప్రాణ ప్రతిష్ఠ చేశారనే కథనం ఒకటి వెలుగులో ఉన్నది. దంతపంక్తి భాగం అలంపూర్ లో పడి జోగులాంబ అమ్మవారు వెలసినట్లు పురాణాల ద్వారా తెలియవస్తున్నది.

అంతే కాకుండా ఉత్తర భారతదేశంలో కొలువై ఉన్న కాశీ విశ్వేశ్వరుడి దర్శనం వలన ఎంత పుణ్యం లభిస్తుందో, ఆలంపూర్ లో నెలకొని ఉన్న ‘బాల బ్రహ్మేశ్వరుడి దర్శనం వలన కూడా అంతే పుణ్యం లభిస్తుందని పురాణాల ఆధారంగా తెలుస్తున్నది. కాశీలో ఉన్నట్లే ఆలంపూర్ లో కూడా 64 స్నాన ఘట్టాలు కలవు. కాశీలో అష్టాదశ శక్తి పీఠాలలో ఒకరిగా విశాలాక్షి అమ్మవారు వెలిస్తే, ఆలంపూర్ లో ఒక శక్తిపీఠంగా జోగులాంబ అమ్మవారు వెలిశారు.

అమ్మవారి విశిష్టరూపం

ఆలంపూర్ క్షేత్రంలో వెలసిన జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో అత్యంత తేజోవంతమైన రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారి కేశాలు గాలిలో తేలుతున్నట్లుగా ఉండి వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం కనిపిస్తాయి. ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారిని గృహచండిగా కూడా పేర్కొంటారు.

బహమనీ సుల్తాన్ పద్నాల్గవ శతాబ్దంలో ఈ దేవాలయంపై దాడి జరిపిన సమయంలో ఆలయం మొత్తం ధ్వంసమైనా కూడా జోగులాంబ అమ్మవారు, ఆమె శక్తి రూపాలైన చండీ, ముండీలను ఆలయానికి సమీపంలో గల బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దాచడం జరిగింది. ఆనాటి నుంచి 2005వ సంవత్సరం వరకు కూడా అమ్మవారి పూజలు అక్కడే జరిగాయి. అయితే 2005లో ఆలయాన్ని పునర్నిర్మించి అమ్మవారిని పునఃప్రతిష్టించడం జరిగింది.

విశేష పర్వదినాలు

కార్తీకమాసంలో, శివరాత్రి పర్వదినం రోజు ఆలంపూర్ క్షేత్రం కన్నుల పండుగగా గోచరిస్తుంది. జోగుళాంబ అమ్మవారికి సంబంధించిన విశేష పూజలు కార్తీకమాసంలో నిర్వహిస్తారు. వర్ణార్చన, కన్యా పూజల కోసం ప్రత్యేకంగా మహిళలు ఇక్కడికి వస్తారు. కార్తీక మాసంలో జరిగే ప్రత్యేక ఉత్సవాల కోసం దేవాలయాన్ని శోభాయమానంగా అలంకరిస్తారు. అదేవిధంగా శివరాత్రి పర్వదినం రోజున బాలబ్రహ్మేశ్వరుని దర్శనార్థం అనేక మంది భక్తులు తరలివస్తారు.

నవబ్రహ్మ ఆలయాలు

ఈశ్వర ప్రసన్నత కొరకు బ్రహ్మదేవుడు చేసిన తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ఈ ప్రదేశంలో వెలిశాడని, బ్రహ్మ కారణంగా వెలిసిన ఈశ్వరుడిని బాల బ్రహ్మేశ్వరునిగా కొలుస్తారని పురాణ కథనాల ద్వారా తెలుస్తున్నది. సాధారణంగా శైవ క్షేత్రాల్లో శివ లింగాలు స్థూపాకారలో దర్శనమిస్తాయి. కానీ అలంపూర్ లో అందుకు విరుద్ధంగా గోస్పాద ముద్రికగా, రసాత్మలింగంగా వెలిశాయి.

ఆలంపూర్ లో జోగులాంబ దేవాలయంతో పాటూ నవబ్రహ్మ ఆలయాలు కూడా అత్యంత ప్రసిద్ది చెందినవి. ఈ ఆలయాల పేర్లు విశ్వబ్రహ్మ, వీరబ్రహ్మ, గరుడబ్రహ్మ, ఆర్కబ్రహ్మ, కుమారబ్రహ్మ, బాలబ్రహ్మ, తారకబ్రహ్మ, పద్మబ్రహ్మ, స్వర్గ బ్రహ్మ మొదలైనవి. ఈ ఆలయాల గోడలపై పంచతంత్ర కథలు, ఆదిత్య హృదయం, రామాయణం, మహాభారతాలకు సంబంధించిన కావ్యాలు, గాథల శిల్పాలు చెక్కబడినవి.

నవబ్రహ్మ దేలయాలు-విశిష్టత

నవబ్రహ్మ ఆలయాలన్నీ తూర్పుముఖంగానే ఉంటాయి. వీరబ్రహ్మ ఆలయం తప్ప మిగతా అన్ని ఆలయాలు అద్భుతమైన శిల్పాలతో అలంకరించబడినవి. వీటిలో అర్కబ్రహ్మ ఆలయాన్ని మాత్రం రాష్ట్రకూటులు నిర్మించారు. ఆలయాలన్నీ ఏకరీతిలో ఉంటాయి. వీటిలో విశ్వబ్రహ్మ ఆలయం పెద్దది. బాలబ్రహ్మ ఆలయంలో నేటికీ పూజలు నిర్వహిస్తున్నారు. బాలబ్రహ్మ ఆలయానికి పక్కన గల చిన్న ఆలయాల శిఖరాలు నగర శైలిలో ఉండగా, మిగిలిన ఆలయాలన్నీ వెసర శైలిలో ఉంటాయి. తారకబ్రహ్మ ఆలయం తప్ప మిగతావన్నీ ఉత్తరాది రేఖా ప్రాసాదాలని భావిస్తారు. తారకబ్రహ్మ ఆలయం మాత్రం ‘దక్షిణాది విమానం’ అనగా ద్రావిడశైలి విమానంగా ఉన్నది. స్వర్గ బ్రహ్మ ఆలయంలో తూర్పు చాళుక్య రాజైన విజయాదిత్యుడు వేయించిన శాసనం కలదు.

అపూరుప శిల్పసంపద

ఆలంపూర్ శిల్పకళలో ‘వాకాటక, కాలచూరి’ శిల్పకళా ప్రభావం ఉన్నట్లు చరిత్రకారుల అంచనా. కుమారబ్రహ్మ దేవాలయ స్తంభాలపై చిత్రించిన శిల్పాలు, ద్వారబంధాలపై శిల్పాలు అద్భుతమైన ఆకర్షణను కలిగి ఉన్నవి. ఇవి మృదువుగా ఉండి అర్ధనిమిలిత నేత్రాలతో చూడముచ్చటగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఇక్కడి శిల్పాల్లో అయినవోలు దుర్గగుడి ప్రభావం, ఎల్లోరా ఆలయంలో ఉన్న వాకాటక, కాలచూర రాజ్యాల శిల్పకళా ప్రభావం కనిపిస్తుంది. కుమారబ్రహ్మ ఆలయంలో ఉన్న శిల్పాలు పూర్వపు సాధారణ శిల్పాల లాగా కాకుండా నిలకడగా చూస్తూ, నవ్వుతూ ఉన్నట్లు కనిపించేలాగా చెక్కడం ఒక ప్రత్యేకత.

చిత్రకళ

తారకబ్రహ్మ ఆలయంలో చెక్కబడి ఉన్న శిల్పాల్లో ‘సప్తమాతృక’ శిల్పాలు ఎక్కువగా ఉన్నవి. బాలబ్రహ్మ ఆలయంలో ఉన్న కార్తీకేయుని విగ్రహం గర్భగుడిలోని విగ్రహంలాగా కనిపిస్తుంది. స్వర్గ బ్రహ్మ ఆలయంలో చిత్రించబడిన గంధర్వుల చిత్రాలు అత్యంత మనోహరంగా కనిపిస్తాయి. ఇవే కాకుండా గంగావతరణ, శివభిక్షమూర్తి శిల్పాలు కూడా చెక్కబడినవి. ఇందులోనే బాలకృష్ణుడు పూతనను వధిస్తున్న చిత్రాలు అద్భుతంగా ఉన్నవి. అదే విధంగా ఒక దూలానికి చివరి భాగంలో పంచతంత్రానికి సంబంధించిన కథలను చిత్రించడం జరిగింది.

సూర్య విగ్రహాలు

ఆలంపూర్ లో 10 సూర్య విగ్రహాలు లభించగా వాటిలో ఏడు ఇసుకరాతితో, రెండు బసాల్ట్ రాతితో, ఒకటి గ్రానైట్ రాతితో చెక్కబడి ఉన్నవి. ఇక్కడి మ్యూజియంలో ఏడు సూర్య విగ్రహాలు ఉండగా, ఒక సూర్య విగ్రహాన్ని హైదరాబాద్ కు తరలించి ‘స్టేట్ ఆర్కియ లాజికల్ మ్యూజియం’ వారి సంరక్షణలో భద్రపరచడం జరిగింది. 13వ శతాబ్దంలో సూర్యారాధన ఉండడం వలన ఈ ప్రదేశానికి ‘భాస్కర క్షేత్రం’ అని పేరుండేది. ఇక్కడి సూర్య విగ్రహాలలో ఉత్తర మరియు దక్షిణ భారతదేశపు శిల్పకళా లక్షణాలను మిళితం చేసి చూపడం ఒక విశేషంగా భావించవచ్చు.

తుంగభద్రా నదీతీరాన అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా భాసిల్లుతున్న మహా మహిమాన్వితమైన అలంపూర్ జోగులాంబ ఆలయం, అపురూప శిల్పకళా చాతుర్యానికి, అద్భుత చిత్రకళా నైపుణ్యానికి నిలయాలుగా ఉన్న నవబ్రహ్మ దేవాలయాలు ఆధ్యాత్మికంగానే కాకుండా ఒక గొప్ప దర్శనీయ ప్రదేశాలుగా కూడా విరాజిల్లుతున్నవి.

Alampur Jogulamba Temple History In English