Koya Tribe History In Telugu
తెలంగాణ రాష్ట్రంలో భూపాలపల్లి, పెద్దపల్లి, మంథని, మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గోదావరి, శబరినది పరీవాహక ప్రాంతాల్లో ఎక్కువగా నివసిస్తున్నారు. ఆదిలాబాద్, కొమురంభీం జిల్లాలలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఉన్నారు. వీరు ఆస్టరాయిడ్ ఉపజాతికి చెందినవారుగా కనిపిస్తారు. వీరి మాతృభాష కోయతూర్ భాష కాగా వీరు తెలుగును కూడా మాట్లాడతారు. కొండల మీద నివసించే వారిని గట్టుకోయ లేదా రాచకోయలనీ; నదీ పరీవాహక ప్రాంతాలు, వాగులు, వంకల పరిసర ప్రాంతాల్లో నివసించే వాళ్ళను గుమ్మకోయలనీ; ఇనుము పని చేసేవాళ్లను కమ్మరకోయలనీ; ఇత్తడి పని, డప్పులను వాయించే వాళ్ళని ముసరకోయలనీ; బుట్టలు అల్లేవారిని గంపకోయలనీ; పూజారులని వడ్డెకోయలనీ; కుల పురాణం చెప్పేవాళ్ళని పట్టెడ కోయలనీ విభజించడం జరిగింది. వీరిలో డోలికోయలు, కాకకోయలు, మట్టకోయలు, లింగకోయలు అనే ఉపతెగలు కూడా ఉంటాయి.
Koya Tribe Agriculture
పోడువ్యవసాయం చేస్తూ, అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. వీరి సంస్కృతిలో కుల పంచాయితీలు జరుగుతాయి. పటేల్, పూజారి కులపెద్దగా ఉంటారు. వీరు చేసే నృత్యాన్ని రేలనృత్యం అంటారు. వీరు ప్రకృతి శక్తులను ఆధరాధించి పూజిస్తారు. ప్రకృతిలో లభించే ప్రతి వస్తువును కూడా శక్తిస్వరూపంగా భావించి పూజిస్తారు. వీరిలో కొందరు సమ్మక్క సారలమ్మ, నాగులమ్మ, ముత్తలమ్మ, మహాలక్ష్మమ్మ, కొర్రాజులు, కాతురుడు, కొమ్మలమ్మ వంటి దేవతలను పూజిస్తారు. మరికొంత కొంతమంది తాబేలుని, ఇంకొందరు ఉడుముని పూజిస్తారు. వీరు ప్రత్యేంగా విగ్రహారాధన చేయరు. వీరి ఇళ్ళు ఒకదానికి ఒకటి దూరదూరంగా ఉంటాయి. మట్టి గోడలు, వెదురు బొంగులతో ఇళ్ళను నిర్మించుకుంటారు. తొలకరి సమయంలో భూమి పండుగ లేదా విత్తు పండుగ, పిల్లల కోసం పెద్దలు చేసే పొట్ట పండుగ, కొత్తల పండుగ లేదా పెద్ద పండుగ, సంక్రాంతి పండుగ తర్వాత జరిపే పండుగ సమ్మక్క పండుగ, పచ్చ పండుగ లేదా చిక్కుడు పండుగ మొదైలన పండుగలు జరుపుకుంటారు.
సాధారణంగా దొరికే జొన్న, సజ్జ, కొర్ర, సామ, వంటి పదర్థాలనే కాకుండా అడవిలో దొరికే రకరకాల కాయగూరలు తమ ఆహారంలో భాగం చేసుకుంటారు. ఆహర సేకరణలో భాగంగా అడవి జంతువులను సైతం వేటాడతారు. వీరి వేషధారణ హిందూ సాంప్రదాయానికి దగ్గరగా కొంత భిన్నంగా ఉంటుంది.
Koya Tribe Culture
కోయ స్త్రీలు కుంకుమను బొట్టుగా ధరించి, కాళ్ళకు ముఖానికి పసుపును పూసుకుంటారు. కాళ్ళకు చేతులకు కడియాలు, చెవికమ్మలు, ముక్కుపోగు, నల్లపూసలు, పుస్తెలతాడు మొదలైన ఆభరణాలు ధరిస్తారు. స్త్రీ పురుషులిద్దరూ గోచీ వేసే సాంప్రదాయం వీరిలో కనిపిస్తుంది.
వీరిలో పరిగ్రహణ, వినిమయ, సేవా, ప్రయోగ, పరిష్కార మొదలైన పద్ధతులలో వివాహాలు జరుగుతాయి. ఇంటి పేరు, గట్టుల ఆధారంగా వరుస కుదురుతుందో లేదో తేల్చి కులపెద్దల సమక్షంలో వివాహ నిర్ణయాలు జరుపుతారు. వివాహ తంతులో వరుడిని తయారు చేసే విధానాన్ని ఊరింద అంటారు. పెళ్ళికి వస్తున్నట్లు అవతలి వారికి తెలియజేయడానికి జోడాలను పంపుతారు. అవిరేని కుండలు, ఎదుర్కోలు, తలంబ్రాలు మొదలైన తంతులు పెళ్ళిలో జరుపుతారు.
వీరి పంచాయితీలు కులపెద్దల సమక్షంలోనే జరుగుతాయి. కులపెద్దలు వంశపారంపర్యంగా కొనసాగుతారు. పెళ్ళిళ్ళ విషయంలో, విడాకుల సమయంలో, భార్యభర్తలిద్దరు తగువు పడినప్పుడు, కులాంతర వివాహాల సమయంలో, పండుగ సందర్భాల్లోనూ ఈ పంచాయితీ ముఖ్యపాత్ర పోషిస్తుంది.