Konda Reddis – History & Lifestyle

ఆదిమజాతులుగా గుర్తించిన వారిలో వీరు మొదటివారు. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గల గోదావరి నది పరివాహక ప్రాంతంలో వీరు నివసిస్తుంటారు. కొండ ప్రాంతాల్లో నివసిస్తూ జీవనం సాగించడం వలన వీరిని కొండరెడ్లని, హీల్ రెడ్లని, రాచరెడ్లని, పాండవరెడ్లని రకరకాల పేర్లతో పిలుస్తారు. వీరు తెలుగు భాషలోనే మాట్లాడుతారు. గడ్డితోను, తాటాకులతోనూ కప్పిఉండే చిన్న చిన్న గృహాల్లో వీరు నివసిస్తారు. అడవిలో లభించే వెదురు బొంగులతో గృహాలను నిర్మించుకుంటారు. వ్యవసాయం వీరి ప్రధాన వృత్తి.

తాము నివసించే కొండ ప్రాంతాల్లోని అడవులను నరికి పోడువ్యవసాయం చేస్తారు. వ్యవసాయం సరిగా లేని సమయాల్లో వెదురుతో తట్టలు, బుట్టలు, చాపలు, తడికెలు తయారుచేసి గ్రామాల్లో లేదా పట్టణాల్లో జరిగే సంతలల్లో అమ్ముతారు. వీటితో పాటు అడవుల్లో లభ్యమయ్యే తేనె, జిగురు, చింతపండు మొదలైనవి పదార్థాలను కూడా విక్రయిస్తారు. ఇతర గిరిజన జాతుల మాదిరిగా వేట కూడా వీరికి ప్రధాన వృత్తి.  వేటాడటం ద్వారా లభించిన జంతుమాంసాన్ని ఉమ్మడిగా పంచుకుంటారు.

వీరికి ముఢనమ్మకాలు ఎక్కువ. అనారోగ్యం సమస్యలు ఎదురైతే ముందుగా భూతవైద్యుణ్ణి సంప్రదిస్తారు. అంటురోగాలేమైనా వ్యాపిస్తే రకరకాల పూజలు నిర్వహిస్తుంటారు. వారు నివాసముండే కొండ ప్రాంతాల నుంచి ఆధునిక వైద్యశాలలు దూరంగా ఉండడం వలన, సరైన రహదారులు, ప్రయాణ సౌకర్యాలు కూడా లేకపోవడంతో స్థానికం నాట్యువైద్యుల ద్వారా నాటు వైద్యం చేయించుకుంటారు. శుభకార్యాలకు హాజరయ్యేప్పుడు స్త్రీలు చెవులకు వెండి దిద్దులు, ముక్కుపుడకలు, మెడలో రకరకాల కడియాలు, కాళ్లకూ కడియాలు, పట్టాలు మొదలైన ఆభరణాలు ధరిస్తారు.

కొండ దేవతలుగా పిలుచుకునే ముత్యాలమ్మ, గంగానమ్మ, భూదేవి, గండమ్మ మొదలైన దేవతలను పూజిస్తారు. వీరి కుల పెద్దను ‘కుదరులు’ అంటారు. కులపెద్ద ఆధ్వర్యంలోనే అన్ని రకాల కట్టుబాట్లు నడుస్తాయి. వర్షాలు కురవడం ప్రారంమైనపుడు భూదేవి పండుగను జరుపుకుంటారు. పందిని బలి ఇవ్వడంతో వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. పంట చేతికొచ్చే సమయంలో కోతల పండుగ చేస్తారు. మామిడికాయ కోతకు వచ్చిన సమయంలో పెద్ద పండుగను నిర్వహిస్తారు. అందులో భాగంగా డోలు నృత్యం, కాళ్ళ గజ్జెలు, డప్పుల దరువుతో స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ కలిసి నృత్యం చేస్తారు. ఈ సమయంలో జంతువుల కొమ్ములతో, నెమలి ఈకలతో అలంకరించుకుని ప్రత్యేక వస్త్రధారణతో కనిపిస్తారు.

ఈ తెగలో మూడు రకాల వివాహాలు జరుగుతాయి. ‘మొగనాలు’ అనే బలవంతపు పెళ్లి చేసుకోవడం ఒకరకం. ఇది పురాణాల్లో కనిపించే రాక్షస వివాహం లాంటిది. వివాహం చేసుకోవాలనుకున్న స్త్రీ, పురుషుడు ఎవ్వరికీ చెప్పకుండా వెళ్లిపోయి వివాహం చేసుకోవడం రెండరకమైనది. మూడవది పెద్దల అనుమతితో జరిగే పెళ్లి. కట్నకానులక ప్రసక్తి లేకుండానే వివాహాలు జరుగుతాయి. బహుభార్యత్వం, పునర్వివాహాలు సర్వసాధారణం. తమ్ముడు మరణిస్తే అతని భార్యను అన్న వివాహం చేసుకునే పద్ధతి ఈ తెగలో ముఖ్యమైనది.