Skip to content

Charminar History In Telugu And English

హైదరాబాద్ ఘన చరిత్రకు నిదర్శనం చార్మినార్

హైదరాబాద్ అనగానే వెంటనే గుర్తు వచ్చేది చార్మినార్. ఒక సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజేసే కట్టడంగా చార్మినార్ ప్రపంచ ప్రసిద్ది చెందింది. గోల్కొండ నవాబు మహ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో క్రీ.శ. 1591 లో హైదరాబాద్ పాతబస్తీలో చార్మినార్ నిర్మాణం జరిగింది. గోల్కొండను పాలించిన కుతుబ్ షాహీల కాలం నాటి వాస్తు శైలిని, కళా నైపుణ్యాన్ని చార్మినార్ ప్రతిబింబిస్తుంది. అప్పట్లో ప్రబలిన భయంకర ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా చార్మినార్‌ను నిర్మించారనే చారిత్రక కథనం కూడా గలదు. దీని నిర్మాణం జరిగి సుమారుగా 431 సంవత్సరాలు గడిచినా విశేషంగా పర్యాటకులను ఆకర్షిస్తున్న చార్మినార్ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా ప్రత్యేక గుర్తింపును పొందింది.

Know The Charminar History in Teluglu

స్మారక చిహ్నంగా నిర్మించిన ఈ చారిత్రక సౌధం నిర్మాణం వెనుక చాలా మందికి తెలియని పలు ఆసక్తికర అంశాలు దాగి ఉన్నవి. ఈ నిర్మాణానికి సంబంధించిన విషయాలు కొన్ని ఆశ్చర్యకరంగానూ, అంతుచిక్కని రహస్యాలుగా కూడా ఉన్నవి. నాలుగు శతాబ్దాలకు పూర్వం నిర్మించిన ఈ నిర్మాణం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండడానికి ఆ కాలంలో ఉపయోగించిన సాంకేతిక నైపుణ్యాల గొప్పదనం ఏ పాటిదో తెలుస్తున్నది. 

Charminar Architectural Overview – చార్మినార్ నిర్మాణ శైలి

హైదరాబాద్ లో స్థిరపడిన ఇరానియన్ వాస్తుశిల్పి మీర్ మోమిన్ అస్రావాదిని చార్మినార్ రూపశిల్పిగా చెబుతారు. ఈ కట్టడంపై పర్షియన్ శైలి ప్రభావం ఉన్నట్లనిపించినప్పటికీ ఇండో-ఇస్లామిక్ నిర్మాణ శైలిలో నిర్మించబడినది. సున్నపురాయి, గ్రానైట్, పాలరాయి, మోర్టార్లను ఉపయోగించి ఈ కట్టడం నిర్మించబడింది. చార్మినార్ ప్రతి వైపు ఇరవై మీటర్ల పొడవుతో సంపూర్ణ చతురస్రాకార ఆకృతిని కలిగి ఉంటుంది. నాలుగు మూలల వద్ద అమర్చబడిన నాలుగు తోరణాలు, నాలుగు సున్నితమైన మినార్లు స్మారక చిహ్నానికి విలక్షణమైన రూపాన్ని చేకూర్చాయి. చార్మినార్ లో గల ప్రతి మినార్ నాలుగు అంతస్తులతో, 56 మీటర్ల పొడవు, రెండంతస్తుల బాల్కనీ కలిగి దాని పైభాగంలో ఒక గోపురం ఆకారంలో నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఈ స్మారక చిహ్నం యొక్క పై అంతస్తుకి వెళ్ళడానికి 149 మెట్లు ఉన్నాయి. పై అంతస్తు నుండి చూస్తే హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కనిపిస్తాయి.

Interesting Facts About Charminar – చార్మినార్ నిర్మాణంలో నాలుగు అంకెకు గల ప్రత్యేకత

ఈ నిర్మాణాన్ని నిశితంగా పరిశీలిస్తే ప్రతి కట్టడంలో నాలుగు అంకె ప్రతిబింబిస్తుంది. పైన కనబడే నాలుగు మినార్లే కాకుండా లోపలి వైపు కూడా అదే నాలుగు అంకెను ప్రతిబింబిస్తూ నిర్మాణాన్ని పూర్తిచేయడం వలన చార్మినార్ ప్రపంచంలోనే ఒక విశిష్ట కట్టడంగా ప్రఖ్యాతి పొందింది. పురావస్తు శాఖవారు చేసిన పరిశోధనల్లో దీని నిర్మాణ శైలికి సంబంధించిన అనేక నిజాలు వెలుగుచూశాయి. చార్మినార్ లో గల ఒకొక్క మినార్ భూమట్టం నుండి సుమారు 56 మీటర్ల ఎత్తులో ఉన్నది. అదే మినార్ చార్మినార్ లోని రెండవ అంతస్తు నుండి చూస్తే 34 మీటర్ల ఎత్తులో ఉంటుంది. వీటిలో కూడా ఒక్కో దాంట్లో మరల మూడంతస్తులుంటాయి.

ఈ స్మారక చిహ్నం నిర్మాణంలో, నాలుగు మరియు దాని గుణిజాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇందులో నిర్మించబడిన ప్రతి కొలత కూడా నాలుగుతో విభజితమయ్యేలాగా ఉండడం విశేషం. కట్టడానికి నలుదిశలా ఉన్న నలభై ముఖాల కొలతలు నాలుగుతో విభజితమయ్యే లాగా నిర్మించబడింది. ఇది అద్భుతమైన నిర్మాణ శైలికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇందులోని ఆర్చ్ ల రూపకల్పన, మెట్ల నిర్మాణం కూడా నాలుగు అంకెతో సంబంధం కలిగి ఉంటాయి. రెండవ అంతస్తుకు నాలుగో ఆర్చ్ కు నలు దిక్కులా నాలుగు గడియారాలు అమర్చబడి ఉంటాయి. ఈ గడియారాలను నిజాంల పాలనాకాలంలో 1889 సంవత్సరంలో హైదరాబాద్ పాలకుడుగా ఉన్న మీర్ మహబూబ్ అలీఖాన్ లండన్ నుంచి తెప్పించాడు. ఈ గడియారాల అమరికాతో  చార్మినార్ అందం మరింత ద్విగుణీకృతమైనది. 

చార్మినార్‌ యందు గల ప్రతి మినార్ లోను నాలుగు గ్యాలరీలు ఉండగా మొదటి మరియు రెండవ గ్యాలరీల్లో ఇరవై ఆర్చ్ లు; మూడు మరియు నాలుగవ గ్యాలరీల్లో పన్నెండు ఆర్చ్ లు కలవు. ప్రతి మినార్ లో బాల్కనీలు ఏర్పాటు చేసి వాటిలో శిల్పాలు అమర్చేందుకు అనువైన 44 ఖాళీ స్థలాలు ఏర్పాటు చేశారు. ఇందులో గల విశాలమైన ఆర్చ్ లకి రెండువైపులా నాలుగు ఖాళీ స్థలాలు ఉంటాయి. ఈ విధంగా మొత్తం 32 స్థలాలు ఉంటాయి. కట్టడం పైకి వెళ్లటానికి ప్రతి మినార్ లోను మెట్లు ఉన్నాయి. ఆ మెట్లను చేరుకోవటానికి నాలుగు ఆర్చ్ లు ఉన్నాయి. మెదటి, రెండవ అంతస్తులలో పదహారు చిన్న, పెద్ద ఆర్చ్ లు ఇరువైపులా ఉన్నాయి. మూడవ అంతస్తులో పదహారు ఆర్చ్ లు ఉన్నాయి. ఈ విధంగా చార్మినార్ పేరులోనే కాకుండా ఇందులో గల ప్రతి నిర్మాణం కూడా నాలుగు అంకె యొక్క విశిష్టతను సూచించడం గొప్ప విశేషమే. హైదరాబాద్ నగరంలో మొట్టమొదటి బహుళ అంతస్తుల నిర్మాణంగా చార్మినార్ కు ప్రత్యేకత కలదు. దేశంలో గల ప్రాచీన స్మారక నిర్మాణాలలో ఒకటిగా కూడా చార్మినార్ ప్రత్యేకతను చాటుతున్నది.

చార్మినార్‌కు ఉత్తరంగా మచిలీ కమాన్, దక్షిణంగా చార్మినార్ కమాన్, తూర్పున కాలి కమాన్, పశ్చిమాన షేర్-ఇ-బాతిల్ కమాన్ అనబడే నాలుగు కమాన్లు ఉంటాయి. చార్మినార్‌కు సమీపంలో గల ఈ నాలుగు కమాన్లు బలిష్టమైన సింహద్వారాల వలె ఉండి కుతుబ్ షాహీల రాచరికపు చిహ్నాలుగా ఈరోజుకీ చెక్కుచెదరకుండా ఉండి పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. చార్మినార్ నిర్మాణానికి ప్రాధాన్యత ఉనట్లే వీటికి కూడా అంతటి విశిష్ట చరిత్ర, ప్రాముఖ్యత కలదు. మక్కా మసీదు, భాగ్యలక్ష్మి దేవాలయం రెండూ చార్మినార్ పక్కనే కొలువై ఉండడం ఈ ప్రదేశంలో నెలకొని ఉన్న మత సామరస్యాన్ని సూచిస్తున్నది.

గోల్కొండ కోట నుంచి చార్మినార్ కు భూగర్భ సొరంగం ఒకటి ఉన్నట్లు చారిత్రక కథనాల ద్వారా తెలుస్తున్నది. అనుకోని విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు రాజకుటుంబీకులు తప్పించుకునేందుకు వీలుగా ఈ సొరంగ మార్గం ఏర్పాటు చేయబడింది. ఈ సొరంగ మార్గం ఉందనే విషయం నేటికీ ఒక రహస్యంగానే మిగిలిపోయింది.

ఒక ఇనుప గ్రిడ్ ఆకారంలో నిర్మించబడిన హైదరాబాద్ నగరానికి చార్మినార్ కేంద్ర బిందువుగా ఉంటుంది. హైదరాబాద్ నగరానికి తూర్పు నుండి పడమర వైపునకు, ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపునకు రెండు రహదారులు ఉండగా చార్మినార్ కేంద్ర బిందువుగా నిర్మించబడింది. కేవలం ఒక స్మారక చిహ్నంగానే కాకుండా, అలనాటి వైభవాన్ని సూచించేదిగా కూడా నిర్మించిన ఈ విశిష్ట కట్టడను రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉన్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *