ఉమ్మడి వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురం గ్రామ వాస్తవ్యులైన ఓరుగంటి మల్లమ్మ, సాయిలు దంపతులకు ఐలమ్మ జన్మించింది. పదకొండు సంవత్సరాల చిన్న వయస్సులోనే పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో ఐలమ్మకు ఆమె తల్లిదండ్రులు వివాహం జరిపించారు. వివాహం అయిన తరువాత ఐలమ్మ పేరు చిట్యాల ఐలమ్మగా మారింది. వృత్తిపరంగా రజక కులానికి చెందిన వనిత కావడంతో తెలంగాణ సాయుధ పోరాట కాలం నుండి ఈమె పేరు చాకలి ఐలమ్మగా ప్రాచుర్యం పొందింది. ఐలమ్మ చేసిన భూస్వామ్య వ్యతిరేక పోరాటం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా కీర్తించబడుతుంది.
Chakali Ilamma Real-life Story In Telugu – జీవిత చరిత్ర
నిజాం నిరంకుశత్వం రాజ్యమేలుతున్న కాలంలో వెనుకబడిన కులాల ప్రజలు దొరల ఇళ్ళల్లో, పొలాల్లో వెట్టిచాకిరీ చేస్తూ ఉండేవారు. ప్రజలు ఎనలేని పన్నుల భారంతో నిలువనీడ లేకుండా బ్రతుకుతున్న సందర్భాలెన్నో ఉండేవి. నిజాం రాజ్యంలో జరుగుతున్న అకృత్యాలను ఎదుర్కొనడానికి ఊరూరా వాడవాడలా ఆంధ్రమహాసభ పేరుతో ప్రజలను చైతన్యం చేస్తున్న కమ్యూనిస్టు పార్టీ భావాల పట్ల ఆకర్షితురాలైన ఐలమ్మ పార్టీ చేపట్టే కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేది. నిజాం మరియు దొరల ఆగడాలకు వ్యతిరేకంగా ఆంధ్రమహాసభ కమ్యూనిస్టు పార్టీ చేస్తున్న సాయుధ పోరాటంలో ఐలమ్మ కీలకపాత్ర వహించింది.
పాలకుర్తికి సమీపంలో గల మల్లంపల్లి మత్తేదారు కుటుంబానికి చెందిన ఉత్తంరాజు రాఘవరావుకు చెందిన 40 ఎకరాల భూమిని మక్త (కౌలు)కు తీసుకుని ఐలమ్మ, నర్సయ్య దంపతులు సాగుచేస్తుండేవారు. తన పొలంలో పనిచేయడానికి నిరాకరించి స్వతంత్రంగా సాగుచేసుకుంటున్న వీరి ఎదుగుదలను చూసి ఓర్వలేని విసునూరు దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డి మరియు స్థానిక పోలీస్ పటేల్ (పట్వారి) వీరమనేని శేషగిరిరావు ఇద్దరు కలిసి తప్పుడు కేసు బనాయించి ఐలమ్మను, ఆమె భర్త మరియు కుమారులతో పాటు మరికొంతమంది ఆంధ్రమహాసభ ముఖ్య నాయకులను జైలుకు పంపడం జరిగింది.
కానీ న్యాయం ఐలమ్మ పక్షాన ఉండడంతో కోర్టు తీర్పు దేశ్ ముఖ్ కు వ్యతిరేకంగా వచ్చింది. దీనిని అవమానంగా భావించిన దేశ్ ముఖ్ ఐలమ్మపై మరింత పగబట్టి ఆమె కుటుంబాన్ని ఆర్థికపరంగా నిర్వీర్యం చేస్తేనే పార్టీ పట్టు కోల్పోతుందని భావించి పట్వారితో కుమ్మక్కై ఐలమ్మ కౌలుకు తీసుకున్న భూమిని తన పేరున రాయించుకోవడమే కాకుండా పంటను కోసుకుని రమ్మని తన మనుషులకు పురమాయించాడు. ఈ విషయం తెలిసిన ఐలమ్మ ఆంధ్రమహాసభ కార్యకర్తలు, పార్టీ ముఖ్య నాయకులు భీంరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, చకిలం యాదగిరి, నల్లు ప్రతాపరెడ్డి, నల్లా నరసింహులు మొదలైన వారి సహకారంతో దేశ్ ముఖ్ పంపిన మనుషులకు తగిన గుణపాఠం చెప్పి వారి ప్రయత్నాన్ని తిప్పికొట్టడమే కాకుండా తన పంటను సైతం ఇంటికి చేర్చింది.
ఐలమ్మ చేసిన భూపోరాటం విజయంతో కమ్యూనిస్టులు పాలకుర్తి దొర ఇంటిపై దాడిచేసి మొత్తం ధాన్యాన్ని ప్రజలకు పంచేశారు. దొరకు సంబంధించిన 90 ఎకరాల భూమిని కూడా ప్రజలకు పంచేశారు.
ఐలమ్మను తన గడీకి పిలిపించుకొని ఈ క్షణం నిన్ను చంపితే ఏం చేస్తావని ప్రశ్నించిన దొరకు. నన్ను చంపితే నా కొడుకులు నిన్ను చంపి నీ అంతుచూస్తారని ధీటుగా జవాబిచ్చిన వీర వనిత ఐలమ్మ. ఆమె చూపిన తెగువ సామాజికంగా దిగువ వర్గానికి చెందిన అనేక మంది ప్రజలకు ప్రేరణ, స్ఫూర్తినిచ్చింది. ప్రతి ఊరిలో సాయుధపోరాట ఉద్యమం రూపుదాల్చడానికి ఐలమ్మ చేసిన కృషి కొనియాడదగినది.
దేశ్ ముఖ్ కబంధ హస్తాల నుండి తన భూమిని దక్కించుకుని ‘దున్నేవారిదే భూమి‘ అనే నినాదాన్ని బలంగా వినిపించిన ఐలమ్మ భూస్వామ్య వ్యతిరేక పోరాటానికి గుర్తుగా తెలంగాణ సాయుధపోరాట చరిత్రలో చిరస్మరణీయురాలై నిలిచింది. చాకలి ఐలమ్మ సెప్టెంబర్ 10, 1985 న అనారోగ్యంతో మరణించింది.