ఈ కలియుగంలో కష్టాలను కడతేర్చే కలియుగ దైవాలుగా మరియు ఆపదలో ఉన్నవారిని ఆదుకునే గొప్ప దేవతలుగా సమ్మక్క-సారక్క లు కొలవ బడుతూ ఉన్నారు.
అసలు ఈ సమ్మక్క-సారక్కలు ఎవరు? వీరిని గిరిజనులు వన దేవతలుగా కొలవడానికి గల కారణాలేంటి. మనం దీని గురించి పూర్తిగా వివరాలు తెలుసుకోవాలంటే 13వ శతాబ్దానికి వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది.
Sammakka Sarakka Jatara in Telugu
వరంగల్ నగరానికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న మూలుగు జిల్లా లో గల తాడ్వాయి మండలంలోని మేడారం అనే గ్రామం లో గల దట్టమైన అడవులు మరియు కొండ కోనల మధ్య ఈ జాతర జరుగుతుంది.
భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధిక మంది హాజరు అయ్యే పండగే ఈ మేడారం సమ్మక్క సారక్క జాతర.తెలంగాణ నుండే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, మరియు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఈ జాతరకు విచ్చేసి తమ మొక్కులు చెల్లించుకుంటారు.
Telangana well-known State Festival is Sammakka Sarakka Jatara. It is a festival of honouring the mother & daughter who lived 800 years ago fought for the people’s wish.
13వ శతాబ్దంలో లో నేటి కరీంనగర్ కు చెందిన జగిత్యాల దగ్గరలో గల పొలవాస అనే గ్రామానికి రాజుగా మేడ రాజు ఉండేవాడు. అప్పట్లో ఆ ప్రాంతమంతా కరువుకాటకాలతో అల్లాడి పోతూ ఉండేది. గిరిజనులు అందరూ తమ కోసం ఎవరో ఒకరు రాకపోతారా తమని ఆదుకో క పోతారా అని ఎదురు చూడసాగారు. ఒకరోజు వాళ్లు వేటకు వెళ్లిన సమయంలో ఒక చిన్న పాపా పుట్ట మీద పడుకొని తన చుట్టూ సింహాలు పులులను రక్షణగా చేసుకుని ఉంది. ఆ పాప దేవుడు పంపించిన దైవంగా భావించి మేడరాజు సమ్మక్కగా పేరుపెట్టి పెంచుకున్నాడు. సమ్మక్కకు యుక్త వయసు రాగానే, మేడరాజు యొక్క మేనల్లుడు పగిడిద్ద మహారాజుకి సమ్మక్క ను ఇచ్చి వివాహం జరిపించాడు.
వీరికి ముగ్గురు సంతానం వారు సారక్క, జంపన్న, నాగులమ్మ. అయితే అప్పటి వరంగల్ మహారాజు అయినటువంటి ప్రతాపరుద్రుడు రాజ్య విస్తరణ కాంక్షతో పొలవాస పైకి దండెత్తుతాడు. దీంతో మేడరాజు తన అల్లుడు అయినటువంటి పగిడిద్ద మహారాజు దగ్గరికి అనగా మేడారానికి వెళ్ళి తలదాచుకున్నాడు.
అయితే మేడారం యొక్క రాజు అయినటువంటి పగిడిద్ద మహారాజు ప్రతాపరుద్రుని సామంతునిగా తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఒకానొక సమయంలో మేడారం కూడా తీవ్రమైన కరువు కాటకాలతో విలవిల్లాడిపోతోంది. అదే సమయంలో లో కప్పం కట్టడం సాధ్యం కాదు అని పగిడిద్ద మహారాజు ప్రతాపరుద్రుని వేడుకోవడం జరిగింది. కానీ ప్రతాపరుద్రుడు మేడరాజుకు ఆశ్రయం ఇవ్వడం, తనపైకి గిరిజన ప్రజలను ఉసిగొల్పడం, అనేక కారణాలతో కోపోద్రిక్తుడై తన మహామంత్రి యుగంధర్ ని మేడారం మీదకి యుద్ధానికి వెళ్ళమని ఆదేశిస్తాడు.
మాఘశుద్ధ పౌర్ణమి అనే మహా పవిత్రమైన రోజున ప్రతాపరుద్రుని సేనలు యుగంధర్ సమక్షంలో మేడారం పైకి దండెత్తి తాయి. అయితే పగిడిద్ద మహారాజు, మేడరాజు, పగిడిద్దరాజు మరియు సమ్మక్క, వాళ్ల బిడ్డలు అయినటువంటి సారక్క, నాగులమ్మ, జంపన్న లు, సాంప్రదాయ ఆయుధాలు ధరించి గెరిల్లా తరహా లో కాకతీయుల పైకి యుద్ధాన్ని ప్రారంభించారు.
అయితే అతి ఎక్కువ సంఖ్యలో ఉన్న కాకతీయులు పగిడిద్దరాజును, మేడరాజును, పరాజయం పాలు చేసి యుద్ధ భూమిలోనే చంపేశారు. ఈ వార్త తెలుసుకున్న సమ్మక్క, సారక్క, మరియు జంపన్న వీరోచితంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే వీరోచితమైన పోరాటం సమయంలో తీవ్ర రక్తస్రావం అయిన జంపన్న సంపెంగ వాగులో పడి వీర మరణం పాలయ్యాడు. అప్పటినుండి ఈ సంపెంగ వాగు కు జంపన్న వాగు అనే పేరు వచ్చింది భక్తులు మొదటగా జాతరకు విచ్చేసి ఈ వాగులో పుణ్యస్నానాలు ఆచరించి జాతరను ప్రారంభించడం జరుగుతుంది ఎందుకంటే ఈ వాగులో స్నానం చేయడం వలన ఎటువంటి రోగాలు కలగవని ఒక ప్రగాఢ నమ్మకం.
సమ్మక్క మరియు సారక్కలు ఇద్దరూ వీరోచితమైన పోరాటంతో యుద్ధాన్ని కొనసాగించారు. ప్రతాపరుద్రుడు వీళ్ళ యొక్క యుద్ధ చతురతను చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు. అయితే కాకతీయ సైన్యం సమ్మక్క, సారక్క లను వెనుక నుంచి దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. సారక్క యుద్ధ భూమిలోనే మరణించగా సమ్మక్క తీవ్రమైన రక్తస్రావంతో తాను ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ వస్తానని గిరిజనులకు మాట ఇచ్చి చిలుకలగుట్ట వైపు వెళ్లి అదృశ్యం అయింది. అటుగా వెళ్ళిన గిరిజనులకు సమ్మక్క జాడ కనపడలేదు మరియు ఒక పుట్ట మీద పసుపు, కుంకుమ భరిణలు కనిపించడం వల్ల సమ్మక్క-సారక్కలు ఇద్దరిని వన దేవతలు గా అప్పటినుంచి పిలవడం మొదలుపెట్టారు.
1946 వరకు కేవలం చిలకలగుట్ట కు చెందిన గిరిజనులు మాత్రమే చిన్న గ్రామంలో ఈ జాతరను జరుపుకునేవారు. 1960 నుండి తెలంగాణ ప్రజలు మొత్తం ఈ జాతరలో పాల్గొనడం ప్రారంభించారు. 1996 సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమ్మక్క-సారక్క జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగింది.
Sammakka Sarakka Jatara in Telugu
జాతర జరిపే విధానం
జాతరకు సుమారుగా 10 రోజుల ముందునుండే వంశపారంపర్యంగా పూజలు నిర్వహించే గిరిజన పూజారులే పూజా కార్యక్రమాల బాధ్యతలు నిర్వర్తిస్తారు. జాతర గద్దెల ప్రాంగణానికి దేవతలను తీసుకురావడం కూడా సాంప్రదాయబద్ధంగానే జరుగుతుంది. జాతరలో భాగంగా మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెవద్దకు తీసుకొని వచ్చి ప్రతిష్ఠిస్తారు. రెండవ రోజున చిలకల గుట్టలో పసుపు, కుంకుమ భరిణె రూపములో ఉన్న సమ్మక్కను తీసుకుని వచ్చి గద్దెపైన ప్రతిష్టింపజేస్తారు. దేవతలను గద్దెలపై ప్రతిష్టింపజేసే సమయములో భక్తుల పూనకాలతో ప్రాంగణమంతా మారుమోగుతుంది.
ఈ జాతరలో ‘శివసత్తు’ పూనకాలు అత్కంత ఉత్కంఠభరితమైనవి. మూడో రోజు ఇద్దరు అమ్మవార్లను గద్దెలపై కొలువు తీరుస్తారు. నాల్గవ రోజు సాయంత్రం ఆవాహన జరిపిన తరువాత దేవతలను మరల యథాస్థానానికి తరలిస్తారు. భక్తులు తమ కోరికలు తీర్చమని వేడుకుటూ బెల్లమును అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించడం ఇక్కడి ఆనవాయితీగా మారింది.
Sammakka Sarakka జాతర ప్రత్యేకతలు
- గిరిజన తెగలలో సమ్మక్క – సారక్క జాతర అతిపెద్ద పండుగ.
- ఆసియా ఖండం లోనే అతిపెద్ద గిరిజన జాతర గా ఐక్యరాజసమితికి చెందినటువంటి UNESCO గుర్తిచ్చింది.
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 1996 లో సమ్మక్క – సారక్క జాతర ను రాష్ట్ర పండుగగా గుర్తించింది.
- ఎలాంటి విగ్రహాలు లేని చారిత్రాత్మకమైన పండగ శ్రీ సమ్మక్క సారక్క జాతర
- ఈ పండుగ గిరిజన సంస్కృతి , సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది.
- సమ్మక్క సారక్క ల ఇద్దరి శాపం కారణంగానే కాకతీయుల సామ్రాజ్యం పతనమైంది అని గిరిజనుల ప్రగాఢ నమ్మకం.
ఈ జాతరను తెలంగాణ కుంభమేళా అని కూడా అంటారు ఎందుకు అంటే తెలంగాణ నలుమూలల నుంచి కాకుండా మన పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి వారి యొక్క కోరికలు నెరవేర్చాలని కోరుతూ ఉంటారు.