Skip to content

Telangana Bathukamma Festival – A Cultural & Floral Festival

Telagnana Bathukamma Festival in Telugu

తెలంగాణ విశిష్టతను చాటే బతుకమ్మ పండుగ 

తెలంగాణాలో స్త్రీలచే జరుపబడే ఏకైక పూల పండుగ బతుకమ్మ పండుగ. తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగను ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు దసరా పండుగకి రెండు రోజుల ముందు వరకు జరుపుకుంటారు. ఈ పండుగలో భాగంగా గౌరీదేవిని పూజిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన  తరువాత తొలిసారిగా 2014 అక్టోబర్ 2న రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహించింది. అప్పటి నుండి ప్రతిసంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా దీనిని పెద్ద పండుగ లాగా నిర్వహిస్తున్నారు. 

బతుకమ్మ-చారిత్రక కథనాలు 

క్రీ.శ. 973లో రాష్ట్రకూట పాలకుల సామంత రాజైన రెండవ తైలపుడు చివరి రాష్ట్రకూట పాలకుడైన రెండవ కర్కుడిని ఓడించి స్వతంత్ర కల్యాణీ చాళుక్య రాజ్య స్థాపన చేశాడు. ఇప్పటి తెలంగాణ ప్రాంతం అతడి పాలనలోనే ఉండేది. తైలపుడి వారసుడిగా అతని పుత్రుడు సత్యాశ్రయుడు రాజ్యపాలన చేపట్టాడు. ఇదే కాలంలో వేములవాడలో గల రాజరాజేశ్వరాలయం బహుళ ప్రసిద్ధి చెందిన ఆలయంగా ఉన్నది. శివుడిని రాజరాజేశ్వరుడిగా, పార్వతీదేవి అమ్మవారిని రాజరాజేశ్వరీ దేవిగా భావించి తెలంగాణ ప్రజలు పూజలు నిర్వహించేవారు. రెండవ అరికేసరి వేయించిన ‘దానశాసనం’లో ఈ దేవాలయం గురించిన ప్రస్తావన కలదు. చోళపాలకులు కూడా రాజరాజేశ్వరీ అమ్మవారిని ప్రగాఢంగా విశ్వసించేవారు. చోళ చక్రవర్తి పరాంతక సుందర చోళుడు తన కుమారుడికి రాజరాజ అనే పేరుకూడా పెట్టుకున్నాడు. రెండో పరాంతకుడు వేములవాడలోని రాజేశ్వరాలయాన్ని కూడా సందర్శించాడని చారిత్రక శాసనాల ద్వారా తెలుస్తున్నది. 

క్రీ.శ 985 నుంచి 1014 వరకు చోళరాజ్యం రాజరాజ చోళుడి ఆధీనంలో ఉండేది. ఇతని తరువాత రాజైన రాజేంద్ర చోళుడు కళ్యాణి చాళుక్య ప్రభువైన సత్యాశ్రయుడితో జరిగిన యుద్ధంలో సత్యాశ్రయుడిని ఓడించి తన విజయానికి చిహ్నంగా వేములవాడలో గల రాజరాజేశ్వరి ఆలేయాన్ని ధ్వంసం చేశాడు. ఆలయంలో అమ్మవారితో కలిసి ఉన్న శివ లింగాన్ని వేరుచేసి తనతోపాటు తీసుకువెళ్ళి తన తండ్రికి బహుమతిగా ఇవ్వగా ఆ మహత్తర శివలింగాన్ని రాజరాజు క్రీ.శ. 1010లో తంజావూరులో బృహదీశ్వరాలయం నిర్మించి అందులో ప్రతిష్టాపన చేశాడు. 

చోళరాజు తమ ఇలవేల్పు అయిన వేములవాడ బృహత్ శివలింగాన్ని దౌర్జన్యంగా తంజావూరుకు తరలించడం తట్టుకోలేని తెలంగాణ ప్రజలు తమ బాధను ఒక మహోద్యమంగా మార్చడం ద్వారా చోళ ప్రభువులకు నిరసనలను తెలియజేసే ప్రయత్నంలో భాగంగా బతుకమ్మను సృష్టించారు. తమ ప్రాంతం నుండి లింగాకారంలో ఉన్న ఈశ్వరుడు వెళ్లిపోయిన తరువాత ఇక్కడి ఆలయంలో గల పార్వతీదేవిని ఊరడించడానికి తగు ప్రయత్నాలు చేస్తూ అందులో భాగంగానే పూలతో మేరు పర్వతం ఆకారంలో బతుకమ్మను పేర్చి దాని పై బాగంలో పసుపు గౌరమ్మను ఉంచి, దసరా పండుగకు ముందు తొమ్మిది రోజులు ఆటపాటలతో గౌరీదేవిని పూజించి మళ్ళీ తిరిగి రావాల్సిందిగా వేడుకుంటూ నీళ్లలో నిమజ్జనం చేయడం ఒక ఆచారంగా పాటించారు. తరువాత కాలంలో అది ఒక పెద్ద పండుగగా మారింది. సమస్త సృష్టికి కారణభూతమైన శక్తిస్వరూపాన్ని బృహతమ్మగా వర్ణిస్తూ పూజలు చేశారు. కాలక్రమంలో బృహతమ్మయే బతుకమ్మగా మారింది. 

బతుకమ్మ పండుగ జరుపుకునే విధానం 

ఈ పండుగ పూర్తిగా పూలతో జరిపే ప్రకృతి పండగ. ఆశ్వయుజ మాస కాలంలో దొరికే అన్నిరకాల పూలను ఒకచోటికి చేర్చి బతుకమ్మను కళాత్మక రూపంలో పేర్చి ఊరి పరివారమంతా కలిసి ఒక పండుగలా జరుపుకుంటారు. పువ్వులు, నీరు, ప్రకృతి ప్రధానాంశాలుగా సాగే ఈ పండుగలో స్త్రీలు ముఖ్య భూమికను పోషిస్తారు. బతుకమ్మను పేర్చడానికి రకరకాల పూవులను ఉపయోగించినా కూడా తంగేడు, గునుగు, గుమ్మడి మొదలైన పూలను ప్రధానంగా ఉపయోగిస్తారు. ఊరిలోని స్త్రీలంతా వారి వారి ఇళ్ళలో తయారు చేసిన బతుకమ్మలను ఒకే చోట చేర్చి వాటిచుట్టూ పూలను ప్రతిబింబించేలా వర్తులాకారంలో తిరుగుతూ నృత్యాలు చేస్తూ చప్పట్లు చరుస్తూ పాటలు పాడుతూ ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆలపించే పాటల్లో చాలావరకు సంతాన సాఫల్యతకు సంబంధించి లేదా ఉన్న సంతానాభివృద్ధికి సంబంధించిన భావనలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ పండుగ ప్రధానంగా దైవచింతన కోసం అయినప్పటికీ సామాజికపరమైన ఆలోచనలతో కూడిన పాటలు కూడా ఆలపిస్తారు. ఈ పాటలు మానవ ఆశలు, ఆశయాలను ప్రతిబింబిచేవిగా ఉంటాయి. 

ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో ముగిసే ఈ పూలపండుగలో తొమ్మిది రోజుల పాటు జరిపే పూజలో రోజుకో రకమైన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. మహాలయ అమావాస్య నాడు మొదలయ్యే మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మగా పూజించడం ప్రారంభించి వరుసగా రెండవ రోజు అటుకుల బతుకమ్మ, మూడవరోజు ముద్దపప్పు బతుకమ్మ, నాల్గవరోజు నానే బియ్యం బతుకమ్మ, ఐదవరోజు అట్ల బతుకమ్మ, ఆరవ రోజు అలిగిన బతుకమ్మ, ఏడవరోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదవరోజు వెన్నముద్దల బతుకమ్మ, తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మగా పూజిస్తూ ప్రతిరోజు వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. ఇటువంటి విశిష్టమైన పండుగను కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా దేశ విదేశాల్లో నివసించే తెలంగాణ వాసులు సైతం జరుపుకుని తమ సంస్కృతీ, సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *