హైదరాబాద్ సంస్థానంలో ఆధునిక పాలనా వ్యవస్థకు శ్రీకారం చుట్టినది అసఫ్ జాహీ వంశం. హైదరాబాద్ సంస్థానంలో కుతుబ్ షాహీల పరిపాలన అనంతరం (1512-1687) ఏర్పడిన విపరీత పరిస్థితుల వల్ల ప్రారంభంలో ఎలాంటి నిర్మాణాత్మక కార్యక్రమం చేపట్టడానికి సానుకూలత లేదు. జరిగిన కొద్దిపాటి పనులు కూడా భవన నిర్మాణాలకే పరిమితం అయింది. 1853 తర్వాత నిజాం పరిపాలన విధానంలో సమూల మార్పులు చేపట్టి సంస్కరణలకు శ్రీకారం చుట్టబడింది.
Download Salarjung Visual Ebook
నిజాం పరిపాలన వ్యవస్థలో దివాన్ లేదా ప్రధానమంత్రికి విశిష్ట స్థానం ఉంది. వీరిలో అత్యంత సమర్థుడు మొదటి సాలార్ జంగ్. సాలార్ జంగ్ 1829లో బీజాపూర్‌లో జన్మించాడు. ఇతడు మదీనాకు చెందిన షేక్ ఉమర్ కర్మాన్ సంతతికి చెందినవాడు. ఇతను లండన్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పట్టాను పొందాడు.
నాసీరుదౌలా పరిపాలనా కాలంలో ప్రధానమంత్రిగా పని చేసిన సిరాజ్-ఉల్-ముల్క్ 1853లో మరణించాక అతని మేనల్లుడు మొదటి సాలార్జంగ్ దివాన్‌గా నియమించబడ్డాడు. అదే రోజున చందూలాల్ మనుమడు నారాయణ్ ప్రసాద్ పేష్కార్గా అధికారం స్వీకరించాడు. సాలార్జంగ్గా పిలువబడే మొదటి సాలరింగ్ అసలు పేరు నవాబ్ తురబ్ అలీఖాన్. సాలార్జంగ్ అనేది బ్రిటీష్‌వారు ఇచ్చిన బిరుదు. హైదరాబాద్ సంస్థానంలో ప్రధానమంత్రులుగా పనిచేసిన వారందరిలోనూ అగ్రగణ్యుడు, మేధావి, సంస్కర్త, సమర్థుడు సాలార్జంగ్.
ముప్పై సంవత్సరాల పాటు 1853 నుంచి 1883 వరకు సాలార్జంగ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. అసఫ్ జాహీ రాజులు నాసిరుదౌలా, అఫ్టలుదౌలా, మీరమహబూబ్ అలీఖాన్ ముగ్గురి వద్ద సాలార్జంగ్ ప్రధానమంత్రిగా సమర్థవంతంగా విధులు నిర్వర్తించి నాటి భారతదేశ సంస్థానాలలో గల ప్రధానమంత్రుల్లో ఉన్నతుడుగా కీర్తించబడ్డాడు.
అతడు పదవిని చేపట్టేనాటికి అతని వయస్సు కేవలం 24 సంవత్సరాలు మాత్రమే. అతి చిన్న వయస్సులోనే ప్రధాని పదవిని దక్షతతో నిర్వహించిన రాజనీతిజ్ఞుడు. సాలార్జంగ్ దివాన్ కాకముందే ఇంగ్లీష్ అధికారి డైటన్ వద్ద లండన్‌లో పరిపాలనా పద్ధతులు నేర్చుకున్నాడు. ప్రజా సంక్షేమం కోసం, రాజ్య రక్షణ కోసం ఉన్నతమైన పరిపాలనా వ్యవస్థ ఆవశ్యకమని బ్రిటీష్ వారి నుంచి నేర్చుకున్నాడు. అనతికాలంలోనే సాలార్జంగ్ తన ప్రతిభా పాటవాలతో అత్యున్నత పాలకునిగా, పరిపాలన దక్షునిగా పేరు గడించాడు. సాలార్జంగ్ నిజాం రాజ్య సర్వతోముఖాభివృద్ధికి నిర్విరామ కృషి చేశాడు.
కొందరు అతనిని బహమనీ ప్రధానమంత్రి మహ్మద్ గవాన్‌తో పోల్చారు. “సాలార్ జంగ్ నిజాం రాజ్యవ్యవస్థను పునరుజ్జీవింప చేశాడు.” అని విలియం డిగ్భీ వ్యాఖ్యానించాడు.
నిజాం రాజ్య పరిస్థితులు సాలార్జంగ్ దివాన్‌గా నియమించేనాటికి నిజాం రాజ్య పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. బ్రిటీష్ వారికి చెల్లించవలసిన బకాయిల కింద 1853లో సారవంతమైన రాయచూర్, ఉస్మానాబాద్, బేరార్ ప్రాంతాలను ఇంగ్లీష్ వారు తీసుకున్నారు. తద్వారా నిజాం ఆర్థిక పరిస్థితి పూర్తిగా దివాళా తీసింది. అందుకు సంస్థానంలోని ముస్లింలు ఇంగ్లీష్ వారిపై వ్యతిరేక ధోరణితో ఉన్నారు.
నిజాం ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉండటంతో తన స్వంత ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనిస్థితిలో ఉన్నాడు. నిజాం స్వంత ఖర్చులకు కూడా డబ్బు లేక స్వంత భూములు, వజ్రాలు, నగలు వంటి వాటిని రోహిలా వర్తకుల వద్ద తాకట్టు పెట్టి మూడు కోట్లు అప్పు చేశాడు.
ఉద్యోగులు అవినీతిపరులై ప్రజలను బాధించసాగారు. రాజ్యంలో శాంతి భద్రతలు కరువై దోపిడి, దొంగతనాల వంటి అనైతిక చర్యలు ఎక్కువయ్యాయి. పాలనా యంత్రాంగం బంధుప్రీతితో నిండిపోయింది. రెవెన్యూ విధానంలో కొన్ని చోట్ల వేలం పద్ధతి అమలులో ఉండేది. రైతులను ఎన్నో బాధలకు గురిచేశారు.
అస్తవ్యస్తంగా ఉన్న నిజాం రాజ్యాన్ని సంస్కరించడానికి సాలార్జంగ్ అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు. హైదరాబాద్ సంస్థానంలో ఆధునిక పరిపాలన వ్యవస్థ తొలి పునాది సాలార్జంగ్ కాలంలో నిర్మితమైంది.
సాలార్జంగ్ సంస్కరణ దశలు
మూడు దశాబ్దాల్లో అనేక సంస్కరణలను చేపట్టిన సాలార్జంగ్ తన సంస్కరణలన్నింటిని మూడు దశలుగా అమలు జరిపాడు. అవి:
- 1853 – 1864 ప్రథమ దశ: ఈ కాలంలో సంస్కరణలు మందకొడిగా సాగాయి. బ్రిటీష్‌వారి ఆదరాభిమానాలను పొందే ప్రయత్నం చేస్తూ, పరిపాలనా వ్యవస్థపై పట్టు పెంచుకున్నాడు.
- 1864 – 1880 ద్వితీయ దశ: ఈ కాలంలో సంస్కరణలను వేగవంతంగా, కట్టుదిట్టంగా అమలు చేశాడు.
- 1880 – 1883 తృతీయ దశ: ఈ కాలంలో ఆరవ నిజాం రాజు మీర్ మహబూబ్ అలీఖాన్ తోడ్పాటుతో, ఆంగ్లేయుల సహకారంతో అన్ని సంస్కరణలు పూర్తి చేశాడు.
1. పరిపాలనా సంస్కరణలు
సాలార్జంగ్ పూర్వపు అస్తవ్యస్త పాలనా యంత్రాంగాన్ని సంస్కరించాలని భావించాడు. గతంలో ఉన్న పాలనా విభాగాలను రద్దు చేసి నిజాం రాజ్యాన్ని ఐదు సుబాలుగాను, 17 జిల్లాలుగా విభజించాడు. జిల్లాలను తాలుకాలుగా విభజించాడు. ప్రతీ సుబాకు ప్రధానాధికారి సుబేదార్. జిల్లాకు అవ్వల్ తాలుకాదార్ (కలెక్టర్), ప్రతీ తాలుకాకు తహశీల్దార్ ముఖ్య అధికారులుగా వ్యవహరిస్తారు.
వీరందరికీ ప్రత్యేక కార్యాలయాలు, సిబ్బంది ఉంటారు. ఒక్కొక్క జిల్లాలో ఎంత మంది ఉద్యోగులు ఉండాలో నిర్ణయించబడేది. పాలనా యంత్రాంగానికి దివాన్ లేదా ప్రధానమంత్రి ముఖ్య అధిపతి.
కేంద్ర ప్రభుత్వ విధులను నాలుగు శాఖలుగా విభజించి ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క మంత్రిని నియమించాడు. 1868లో ‘సదర్ ఉల్ మహల్’ అనే పేరుతో నలుగురు మంత్రులు నియమితులయ్యారు. వారికి నూతనంగా ఏర్పడిన పోలీస్, న్యాయ, రెవెన్యూ శాఖలను ఇవ్వడం జరిగింది. నాల్గవ మంత్రి ప్రజాసంక్షేమం, విద్య, ఆరోగ్యం, స్థానిక సంస్థలు నిర్వహిస్తాడు.
మంత్రులందరు ప్రధానమంత్రికి లోబడి పనిచేస్తారు. యువకులైన వారిని సాలార్జంగ్ మంత్రులుగా నియమించి, వారికి పాలనానుభవాన్ని కల్పించాడు. తాలుకాదార్ వ్యవస్థను పర్యవేక్షించేందుకు 1865లో ‘మజ్లిస్-ఇ-మల్-గుజారి’ అనే పాలనా బోర్డ్‌ను ఏర్పాటు చేశాడు.
ప్రధానమంత్రి అయిన సాలార్జంగ్ తనకు సయ్యద్ హుస్సేన్ బిల్గామ్ అనే అతనిని అంతరంగిక కార్యదర్శిగా నియమించుకున్నాడు. బిల్గామ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 1876 నుంచి 1883 వరకు, అంటే సాలార్జంగ్ మరణించే వరకు ఆ పదవిలో ఉన్నాడు. ఇతని అధీనంలో ఇంగ్లీష్ కార్యాలయం కూడా ఉండేది. ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడానికి 14 కార్యాలయాలను సాలార్జంగ్ ఏర్పాటు చేశాడు. దీనితో నిజాం రాజ్యంలో పరిపాలనా వ్యవస్థ క్రమబద్ధతను సంతరించుకున్నది.
పరిపాలనా విధానం: పరిపాలన మొత్తం ప్రధాని సాలార్జంగ్ చేతుల మీద అతని నియంత్రణలో కొనసాగేది. ఇతనినే ‘దివాన్’ లేదా ‘రిజెంట్’ అని కూడా సంబోధించేవారు. సాలార్జంగ్ ప్రధానిగా ఉన్న చివరి దశలో, అంటే 1880లో పరిపాలన వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చాడు. పరిపాలనలో ఉపప్రధాని, బ్రిటీష్ రెసిడెంట్, ఆర్థిక మంత్రి, అత్యంత ముఖ్యమైన నాలుగు శాఖల సలహాలను సాలార్జంగ్ తీసుకొనేవాడు. పరిపాలనలో సమర్ధతను పెంచడానికి అధికార విభజనకు శ్రీకారం చుట్టాడు.
సమర్థవంతమైన పరిపాలనను అందించటానికి పరిపాలన వ్యవస్థను 14 శాఖలుగా విభజించాడు. అవి:
- 1) రెవెన్యూ శాఖ
- 2) న్యాయ శాఖ
- 3) పోలీస్ శాఖ
- 4) ఆర్థిక శాఖ
- 5) సైనిక శాఖ
- 6) వైద్య శాఖ
- 7) ప్రజా పనుల శాఖ
- 8) రాజకీయ శాఖ
- 9) తపాల శాఖ
- 10) రైల్వే, టెలిగ్రాఫ్ శాఖ
- 11) సర్ఫేఖాస్ భూముల శాఖ
- 12) న్యాయ చట్టాల శాఖ
- 13) పురపాలక శాఖ
- 14) విద్యా శాఖ.
పైన పేర్కొన్న 14 శాఖలలో 7 శాఖలకు ప్రత్యేకంగా మంత్రులు ఉండేవారు. అవి రెవెన్యూ, పోలీస్, న్యాయ, విద్య, వైద్య, ప్రజాపనులు, పురపాలక శాఖలు. ఈ శాఖలకు గల మంత్రులను ‘సదర్-ఉల్-మిహం’ అంటారు. ఈ మంత్రులు ఆయా శాఖలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని కార్యదర్శుల ద్వారా రూపొందించి నేరుగా ప్రధానికి నివేదించేవారు. ముఖ్యమైన శాఖలకు మంత్రులతో బాటు ఉపమంత్రి ఉండేవాడు. ఇతనిని ‘సెమి-సదర్-ఉల్-మిహ్యం’ అనేవారు. ఉపమంత్రి మంత్రికి సహాయపడుతూ పన్నుల వసూళ్ళలో కీలకపాత్ర వహించేవాడు. కీలక శాఖల మంత్రులు, ఉపమంత్రులతో బాటు కార్యదర్శులు కూడా ఉండేవారు. వీరు ప్రధాని అధ్వర్యంలో వివిధ శాఖలకు సంబంధించిన అంశాలను పరిశీలించే వారు.
2. ఆర్థిక సంస్కరణలు
సాలార్జంగ్ అధికారానికి వచ్చే వాటికి నిజాం రాజ్య అర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండేది. అంతకు ముందు ప్రధాని పదవిని నిర్వహించిన చందూలాల్ వంటివారి ఆర్థిక విధానాలు నిజాం ఖజానాను దివాలా తీయించాయి. కాబట్టి సాలార్జింగ్ అధికారం చేపట్టగానే ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించి ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషించారు.
ఇందుకోసం అనేక చర్యలు తీసుకున్నాడు. పరిపాలనా యంత్రాంగాన్ని పూర్తిగా పరిశీలించి పనిలేకుండా ఉండి హెచ్చు జీతాలు తీసికుంటున్న ఉద్యోగులను తొలగించాడు. వారు నిర్వహించే పదవులను రద్దు చేశాడు. దీనితో ఉద్రేకంతో ఉన్న వారు సాలార్జంగ్పై హత్యాయత్నం కూడా చేశారు. అయినప్పటికీ అతను చలించకుండా తన సంస్కరణలను అమలు చేశాడు.
నిజామ్కు ఆనాడు మరాఠీల నుంచి, మైసూర్ పాలకుల నుంచి ఇంతకు ముందున్న ప్రమాదాలు లేవు. కాబట్టి సైనికుల సంఖ్యను తగ్గించాలనుకున్నాడు. సికింద్రాబాద్ బొల్లారంలో ఉన్న ఇంగ్లీష్ సైన్యం దేశ రక్షణకు చాలని నిజాం స్వంత సైన్యాన్ని కొంత తగ్గించాడు. ఈ రెండు చర్యల వల్ల ప్రభుత్వ నిర్వహణలో దుబారా ఖర్చు తగ్గి రెండు సంవత్సరాలలో ఆర్థిక లోటు తీరింది. దానితో వడ్డీ వ్యాపారులకు తాకట్టు పెట్టిన నిజాం ఆభరణాలు, వజ్రాలు, భూములను విడుదల చేయించాడు.
సాలార్జంగ్ కాలంలో భారతదేశ చరిత్రలో జరిగిన ప్రధాన సంఘటన సిపాయిల తిరుగుబాటు. 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు భారత దేశంలో కంపెనీ ప్రభుత్వాన్ని కదిలించింది. హైదరాబాద్ సంస్థానం తిరుగుబాటులో చేరాలని ప్రజల నుంచి సాలార్జంగ్పై ఒత్తిడి వచ్చింది. కాని సాలార్జింగ్ దూరదృష్టితో, తన విచక్షణా జ్ఞానంతో అది తప్పని గ్రహించి తిరుగుబాటు దారులను మందలించి ఇంగ్లీష్ వారిని సమర్థించాడు.
ముస్లిం ప్రజలను రెచ్చగొడుతున్న అల్లావుద్దీన్ మౌల్వీని బంధించి అండమాన్ దీవులకు పంపారు. హైదరాబాద్‌లో బ్రిటీష్ రెసిడెన్సీపై దాడి చేసిన తుర్రేబాజాఖాన్ను బ్రిటీష్‌వారు కాల్చి చంపారు. సాలార్జంగ్ బ్రిటీష్ అనుకూల చర్యల వల్ల నిజాం రాజ్యం రక్షించబడింది. సాలార్జంగ్ బ్రిటీష్ వారిని ఒప్పించి 1853లో బకాయి కింద వారు ఆక్రమించిన రాయచూర్, ఉస్మానాబాద్‌లను తిరిగి సంపాదించాడు. బ్రిటీష్ వారికి నిజాం బకాయి పడిన 50 లక్షల రూపాయలను రద్దు చేయించాడు.
సాలార్జంగ్ ప్రధానిగా హైదరాబాద్ సంస్థానానికి చేసిన సేవ గొప్ప ఉపకారమే గాక దీనితో నిజాం ఆర్థిక పరిస్థితి చక్కబడింది. తిరుగుబాటును అణచి వేయడంలో బ్రిటీష్ వారికి సహకరించినందుకు ఐదవ నిజాం అఫ్టల్ ఉద్దెలాకు బ్రిటీష్ వారు ‘స్టార్ ఆఫ్ ఇండియా’ బిరుదుని ఇచ్చారు.
3. రెవెన్యూ సంస్కరణలు
సాలార్ జంగ్ తలపెట్టిన సంస్కరణలలో రెవెన్యూ సంస్కరణలు చాలా ముఖ్యమైనవి. రాజ్యానికి ప్రధాన అదాయ వనరు రెవెన్యూ, కాబట్టి రెవెన్యూ విధానాన్ని 1864-65 లో పూర్తిగా పునర్వ్యవస్థీకరించాడు. అప్పటి వరకు ప్రభుత్వానికి, పన్ను చెల్లించే రైతులకు మధ్య వేలం పాడిన గుత్తేదారులుండేవారు. వీరు రైతులను పీడించేవారు. ఈ విధానాన్ని సాలార్జంగ్ పూర్తిగా మార్చివేశాడు.
సాలార్జింగ్ రూపొందించిన రెవెన్యూ విధానాన్ని ‘జిల్లా బందీ విధానం’ అంటారు. దీని ప్రకారం నిజాం రాజ్యాన్ని 17 రెవెన్యూ జిల్లాలుగా విభజించాడు. ఈ రెవెన్యూ జిల్లాలను 5 ప్రాంతీయ మండలాలుగా ఏర్పాటు చేశాడు.
ప్రాంతీయ రెవెన్యూ మండలాలు:
- ఉత్తర మండలం – నిజామాబాద్, కరీంనగర్ ప్రాంతాలు
- దక్షిణ మండలం – గుల్బర్గా, షోలాపూర్, రాయచూర్ ప్రాంతాలు
- పశ్చిమ మండలం – బీదర్, నాందేడ్ ప్రాంతాలు
- తూర్పు మండలం – వరంగల్, నల్గొండ, ఖమ్మం ప్రాంతాలు
- వాయవ్య మండలం – ఔరంగాబాద్ దాని పరిసర ప్రాంతాలు.
ప్రతీ మండలానికి ఒక సుబేదార్ని నియమించాడు. జిల్లాలో ప్రధాన తహసీల్దారు అనే ఉద్యోగి ఉండేవాడు. భూమి శిస్తు వసూలు చేయడం ఇతని ప్రధానవిధి.
రెవెన్యూ శాఖ: రాజ్యమంతటా రెవెన్యూ పాలనను క్రమబద్ధం చేయటానికి 1864లో రెవెన్యూ బోర్ట్ని ఏర్పాటు చేశాడు. ఇందులో ఒక అధ్యక్షుడు, నలుగురు సభ్యులు ఉంటారు. వీరికి వ్యవసాయం, వర్తక-వ్యాపారాలు, ఎగుమతి దిగుమతి సుంకాలు, స్టాంపుడ్యూటీ, రహదారులు, స్థానిక సంస్థలకు సంబంధించిన పన్నులన్నింటిపై అజమాయిషీ అధికారాలను ఇవ్వడమైంది.
200 రూపాయల వరకు శిస్తు మాఫీ చేసే అధికారం బోర్డ్‌కు కలదు. కాని 1867లో దీనిని రద్దు చేసి దాని స్థానంలో ‘సదర్ మహకే-ఇమేల్ గుజారి’ అనే పేరుతో కేంద్ర రెవెన్యూ శాఖ ఏర్పాటయింది. ఈ శాఖ ప్రధానాధికారులను ‘ముహతామిమ్’, ‘రుకున్’ అనే వారు. వీరు వ్యవసాయం, నీటిసాగు, గ్రామరక్షణ దళం, స్టాంపుల మంజూరీ వంటి విధులు నిర్వర్తించేవారు. కాని దీనిని కూడా 1868లో రద్దు చేసి రెవెన్యూ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు.
రెవెన్యూ మండలాలలో భూమి శిస్తు వసూలు చేయడానికి గతంలో ఉన్న వేలం పద్ధతిని, మధ్య దళారులను తొలగించి రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. రైతుకు ప్రభుత్వానికి ప్రత్యక్ష సంబంధం ఏర్పరచి వారికి తమ భూములపై హక్కులు కలిగించాడు. ఇనాం భూములను రద్దు చేసి, రైత్వారి విధానం ప్రవేశపెట్టాడు.
ప్రతీ 30 సంవత్సరాలకు ఒకసారి శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టాడు. భూమిని కొలిపించి, హద్దులు నిర్ణయించి రికార్డు తయారు చేయించాడు. భూమి విస్తీర్ణాన్ని, సాగు పరిమాణాన్ని బట్టి శిస్తు నిర్ణయించే పద్ధతి ప్రవేశపెట్టాడు. భూమి శిస్తు ధన రూపంలో గాని, ధాన్య రూపంలో గాని చెల్లించవచ్చని నిర్ణయించాడు. భూమిని సర్వే చేయడానికి సర్వే సెటిల్మెంట్ విభాగాన్ని 1875లో ఏర్పాటు చేశాడు.
ప్రభుత్వ ఉద్యోగులకు ఇనాములు ఇచ్చే పద్ధతిని రద్దు చేసి జీతాలు ఇచ్చే విధానాన్ని ఏర్పాటు చేశాడు. అసమర్థులు, అవినీతిగల ఉద్యోగులను తొలగించి సమర్ధులు, నిజాయితీపరులను నియమించాడు. బలవంతంగా పన్నులు వసూలు చేయడం, జరిమానాలు విధించడం, శిక్షలు వేయడం వంటి పద్ధతులను తొలగించాడు.
4. న్యాయ సంస్కరణలు
రాజ్యంలో సంఘ విద్రోహ కార్యక్రమాల నియంత్రణకు సాలార్జింగ్ న్యాయ సంస్కరణలను అమలు పరిచాడు. ఇతను తాలుకా స్థాయిలో, జిల్లా స్థాయిలో న్యాయస్థానాలను ఏర్పాటు చేశాడు. తాలుకాదారుల నియామకాలతో బాటు, మున్సిఫ్లు, మీర్ ఆదిల్ అనే పేరుతో న్యాయమూర్తులను నియమించాడు. నగరంలో మూడు న్యాయస్థానాలను ఏర్పాటు చేశారు.
జిల్లా న్యాయస్థానాల తీర్పులపై అప్పీలుకు హైదరాబాద్‌లో ‘అదాలత్-ఇ-పాదుషాహీ’ అనే ఉన్నత న్యాయస్థానం ఏర్పాటు చేశాడు. ఇందులో ఒక ప్రధాన న్యాయమూర్తి, నలుగురు ఇతర న్యాయమూర్తులు ఉండేవారు. ఈ న్యాయస్థానం మరణ దండన, యావజ్జీవ శిక్ష తప్ప ఏ శిక్షనైనా విధించవచ్చు.
హైదరాబాద్ నగరానికి ప్రత్యేకంగా, ‘బుజుంగి దివానీ అదాలత్’, ‘కుర్థ దివానీ అదాలత్’ అనే రెండు సివిల్ కోర్ట్‌లను మరియు ‘షాంజదార్ అదాలత్’ అనే క్రిమినల్ కోర్టు స్థాపించబడ్డాయి. అందులో ప్రధాన న్యాయమూర్తిని ‘నాజియా’ అని పిలిచేవారు. ఈ న్యాయస్థానాలను సమన్వయం చేయటానికి 1862లో ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఒక న్యాయ సెక్రటేరియట్‌ను ఏర్పాటు చేశారు. నాగరిక సామాజిక దృష్టితో శిక్షలలో మార్పులు తెచ్చారు. శరీర భాగాలను తొలగించే కఠినశిక్షలను రద్దు చేసి కఠిన కారాగార శిక్షలను అమలు చేశాడు.
5. విద్యా సంస్కరణలు
సాలార్జంగ్ గొప్ప విద్యావంతుడు. రాజ్యాభివృద్ధికి మేధావులు, విజ్ఞానవంతుల అవశ్యకతను గుర్తించి అవి విద్య ద్వారానే సాధ్యమని భావించాడు. విద్యావంతులు లేనిదే పరిపాలన సక్రమంగా జరగదని గ్రహించి విద్యాభివృద్ధికి కృషి చేశాడు. రాజ్యంలో విద్యాలయాల స్థాపనకు అతని కార్యదర్శి సయ్యద్ హుస్సేన్ బిల్గాం సహాయ పడ్డాడు.
నాల్గవ నిజాం నాసిరుదౌలా కాలంలో 1855లో ‘దారుల్ ఉలూమ్’ అనే ఉన్నత విద్యా సంస్థను నెలకొల్పి పాశ్చాత్య విద్యావిధానాన్ని ప్రవేశపెట్టాడు. దీనితో పర్షియన్, అరబిక్, ఉర్దూ భాషలతో బాటు ఇంగ్లీష్‌ను కూడా బోధించే ఏర్పాటు చేశాడు. పాశ్చాత్య విద్యకై ఇంగ్లీష్ భాషా బోధనకై అనేక ఆంగ్ల భాషా పాఠశాలలను నెలకొల్పాడు.
నిజాం రాజ్యంలో విద్యాభివృద్ధికై కింది విద్యాలయాలను సాలార్జంగ్ స్థాపించాడు:
- సిటీ హైస్కూల్ స్థాపన – 1870
- చాదర్ఫట్ హైస్కూల్ స్థాపన – 1872
- ప్రభువుల పిల్లల కొరకు ‘మదర్సా అలియా’ – 1873
- రాజ కుటుంబ పిల్లల కొరకు ‘మదర్సా ఏ ఐజా’ – 1878
- గ్లోరియో గర్ల్స్ హైస్కూల్ – 1881.
ఈ విధంగా అనేక విద్యాలయాలను స్థాపించి వాటిలో ఇంగ్లీష్ బోధనను ప్రవేశపెట్టాడు. 1870లో ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించాడు. ఇది హైదరాబాద్ రాష్ట్రానికి సాంకేతిక నిపుణులను అందించింది. కేవలం రాజధాని హైదరాబాద్ లోనే గాక తాలుకా, జిల్లాలలో కూడా విద్యా సంస్థలను నెలకొల్పాడు. సాలార్జంగ్ మరణానంతరం చాదర్ ఘాట్ ఉన్నత పాఠశాలలోని ఇంటర్మీడియట్ తరగతులను మదర్సా-ఎ-అలియాలో విలీనం చేస్తూ 1887లో నిజాం కాలేజీ స్థాపించబడింది.
అలీఘర్‌లో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించిన అలీఘర్ ముస్లీం విద్యాలయానికీ సాలార్జంగ్ ఆర్థిక సహాయం చేశాడు. వికార్ ఉల్ ముల్క్, మొహిసిన్ ఉల్ ముల్క్ అనే హైదరాబాద్ అధికారులు అలీఘర్ విద్యాలయ ఏర్పాటులో పాల్గొన్నారు. తద్వారా విద్య పట్ల తనకు గల మమకారాన్ని సాలార్జింగ్ చాటుకున్నాడు. సాలార్ జంగ్ కృషి వల్ల హైదరాబాద్ సంస్థానంలో మేధావులు, విజ్ఞానవంతులు తయారయ్యారు.
6. పోలీస్ సంస్కరణలు
రాజ్య సుస్థిరాభివృద్ధికి శాంతి భద్రతలు అతి ప్రధానమని భావించి సాలార్జంగ్ పోలీస్ సంస్కరణలు చేపట్టాడు. రెవెన్యూ విభాగం నుంచి పోలీస్ వ్యవస్థను వేరు చేశాడు. సక్రమమైన, క్రమబద్ధమైన, పటిష్టమైన పోలీస్ వ్యవస్థను 1865లో ఏర్పాటు చేశాడు.
రాజ్యంలో గల 17 జిల్లాలకు ఒక్కొక్క పోలీస్ సూపరింటెండెంట్‌ను (ఎస్.పి) నియమించాడు. ఇతను జిల్లా పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని పర్యవేక్షించేవాడు. ప్రతీ రెండు తాలుకాలకు ఒక ఇన్స్పెక్టర్ను నియమించాడు. పెద్ద తాలుకాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇన్స్పెక్టర్ను నియమించాడు. ప్రతీ జిల్లాకు అవసరమైన కింది స్థాయి పోలీస్‌లను కూడా నియమించారు. శాంతిభద్రతల పరిరక్షణ వీరి ప్రధాన విధి.
రాయచూర్, ఉస్మానాబాద్ ప్రాంతాలు బ్రిటీష్ వారి ఆధీనంలో ఉన్నప్పుడు వారు అక్కడ పటిష్టమైన పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అక్కడ పని చేసిన పోలీస్ అధికారులు మిక్కిలి సమర్థులు. సాలార్జంగ్ వారిచేత నిజాం రాజ్యం పోలీస్ వ్యవస్థను పటిష్టం చేశాడు. సమర్థులైన వారిని పోలీస్ విభాగానికి ఎంపిక చేసి వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పించాడు.
సాలార్జంగ్ ఏర్పాటు చేసిన పోలీస్ శాఖను ‘మహాకాయ్-ఇ-కొత్వాలి’ అంటారు. దొంగతనాలు, దారిదోపిడీలను అణచివేయడానికి ‘నిజామత్’ అనే ప్రత్యేక పోలీస్ దళాన్ని కూడా ఏర్పాటు చేశాడు. 1867లో పోలీస్ శాఖను రెవెన్యూ శాఖ నుంచి వేరు చేశాడు. అనంతరం దీనిని న్యాయశాఖ కార్యదర్శి పర్యవేక్షణలోకి తెచ్చాడు.
సాలార్జంగ్ ‘సోవర్స్’ అనే పోలీస్‌లను కూడా ప్రతీ జిల్లాకు నియమించాడు. ప్రభుత్వ కోశం వద్ద రక్షణ బాధ్యతలు; జిల్లా, తాలుకా, ప్రజా సంబంధాల కార్యాలయాల వద్ద రక్షణ విధులను నిర్వహించటం వీరి కర్తవ్యం.
పోలీస్ వ్యవస్థను పటిష్టం చేయడంతో బాటు వారి అధికార, విధులకు సంబంధించి నియమ నిబంధనలను రూపొందించాడు. పోలీస్ ఉన్నతాధికారులను వారి సామర్థ్యం, ప్రవర్తన వంటి అంశాల ప్రాతిపదికన శ్రేణులుగా విభజించి జీతభత్యాలను నిర్ణయించారు. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఇన్స్పెక్టర్లను మూడు శ్రేణులుగా (తరగతులుగా) విభజించాడు. ఈ వర్గీకరణ అధారంగానే వీరి జీతభత్యాలను కింది విధంగా నిర్ణయించాడు.
| పోలీస్ అధికారి | శ్రేణి/తరగతి | జీతం (హాలిసిక్కా) |
| సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ | 1 | 200 |
| సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ | 2 | 170 |
| సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ | 3 | 140 |
| ఇన్ స్పెక్టర్ | 1 | 110 |
| ఇన్ స్పెక్టర్ | 2 | 100 |
| ఇన్ స్పెక్టర్ | 3 | 90 |
పై విధంగా నిజాం సంస్థానంలో అధికారుల ప్రతిభ, సామర్థ్యం అధారంగా జీతాలిచ్చే విధానానికి సాలార్ జంగ్ శ్రీకారం చుట్టాడు. ఆయా అధికారులు క్రమశిక్షణతో, సవాల్ గా తీసుకొని విధిని నిర్వహించడానికి ఈ విధానపు తోడ్పడింది. ఇది ఆచరణలో విజయవంతమైంది. తదనంతరం ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు ఇది మార్గదర్శకంగా నిలిచింది. ప్రతిభ, సామర్థ్యం ఆధారంగా ప్రమోషన్లు ఇచ్చే ‘ఆక్సిలరీ’ విధానం పోలీస్ విభాగంలో ఇప్పటికీ కొనసాగడం విశేషం.
7. కరెన్సీ సంస్కరణలు
కరెన్సీని నియంత్రించడానికి చర్యలు తీసుకొన్నాడు. అస్తవ్యస్తంగా ఉన్న టంకాశాలలను సంస్కరించే ఉద్దేశంతో జిల్లా టంకశాలలను రద్దు చేశాడు. 1855లో హైదరాబాద్‌లో ప్రభుత్వ టంకశాలను ఏర్పాటు చేశాడు. అదే విధంగా హైదరాబాద్‌లో కేంద్ర కోశాగారాన్ని, ప్రతీ జిల్లాలో స్థానిక కోశాగారాన్ని నెలకొల్పాడు.
1858 నుంచి నిజాం నాణేలపైన మొగల్ చక్రవర్తి పేరును తొలగించి నిజాం నవాబు పేరుతో నాణేలు చెలామణి చేశాడు. సాలార్జంగ్ కరెన్సీ సంస్కరణలో అంతర్భాగంగా “హలీసిక్కా” అనే నూతన నాణేలను ముద్రించాడు. ఇతని కరెన్సీ సంస్కరణల వల్ల నిజాం రాజ్య ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి.
సాలార్జంగ్ 1861లో స్టాంప్ పేపర్ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో స్థాపించాడు. కోర్టు వ్యవహారాలకు వాడే పేపర్లకు, ఒప్పంద పత్రాలకు, దరఖాస్తులకు ఉపయోగించే స్టాంప్ పేపర్ల తయారికీ ప్రత్యేక స్టాంప్ పేపర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. బ్రిటీష్‌వారి అనుమతితో బేరార్ ప్రాంతంలో కూడా స్టాంప్ పేపర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. 1861 నుంచి స్టాంప్ పేపర్ కార్యాలయం ‘మున్షిఖానా’ ఆధ్వర్యంలో పని చేసేది.
కాని 1864లో దీనిని రెవెన్యూ బోర్డ్ ఆధీనంలోకి తీసుకొచ్చారు. అనంతరం ప్రభుత్వ అధికార వ్యవహారాలు పెరగడంతో దీని ప్రాముఖ్యత పెరిగింది. తద్వారా స్టాంప్ పేపర్ కార్యాలయాన్ని రెవెన్యూ బోర్డ్ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేశారు. దీని నిర్వహణ కోసం ‘సూపరింటెండెంట్ ఆఫ్ స్టాంప్స్’ను నియమించాడు. ప్రత్యేక స్టాంప్ పేపర్ కార్యాలయం 1870 నాటికి నిజాం రాజ్యంలో అందుబాటులోకి వచ్చింది.
8. రవాణా సౌకర్యాలు
సాలార్జంగ్ రోడ్డు, రైల్వే మార్గాల అభివృద్ధికీ కృషి చేశాడు. బ్రిటీష్ వారి సహకారంతో రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. హైదరాబాద్‌ను అన్ని ప్రధాన పట్టణాలను కలుపుతూ రహదారులను నిర్మించాడు. 1870లో మద్రాస్ నుంచి బొంబాయి వరకు హైదరాబాద్, వాడి, గుల్బర్గాల మీదుగా నిర్మించదలచిన రైల్వేలైన్ కోసం బ్రిటీష్ వారితో ‘చాందా రైల్వే పథకం’ అనే ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు.
ఇందులో అంతర్భాగంగా హైదరాబాద్‌లో మొదటి రైల్వే లైన్ సికింద్రాబాద్ – వాడిల మధ్య ప్రారంభించబడి 1878లో పూర్తి అయింది. హైదరాబాద్ నుంచి షోలాపూర్ వరకు రోడ్డును నిర్మించాడు. రవాణా సదుపాయాల కల్పనకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేశాడు. ఈ శాఖ అన్ని జిల్లాలను కలుపుతూ అనేక రవాణా మార్గాలను నిర్మించింది. దీనితో హైదరాబాద్‌కు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు ఏర్పడి వర్తక, వాణిజ్యాలు అభివృద్ధి చెందాయి.
ఇతర సంస్కరణలు
సాలార్ జంగ్ నిజాం రాజ్య సర్వతోముఖాభివృద్ధి కొరకు అనేక ఇతర సంస్కరణలు చేపట్టాడు అవి:
- ఎ) హైదరాబాద్ సమాజంలో గల సామాజిక రుగ్మత అయిన సతీసహగమనాన్ని నిషేధించాడు.
- బి) చాదర్ ఘాట్‌లో పారిశ్రామిక వస్తు ప్రదర్శనశాలను ఏర్పాటు చేశాడు. దీనిని ఇప్పటికీ ప్రతీ సంవత్సరం నిర్వహిస్తున్నారు.
- సి) హైదరాబాద్ – బొంబాయి ల మధ్య టెలిగ్రాఫ్ లైన్ వ్యవస్థను వేయించాడు.
- డి) 1862 సంవత్సరంలో పోస్టల్ శాఖను ఏర్పాటు చేసి ఇతర ప్రాంతాల ప్రజలతో సమాచార సంబంధాలను పెంపొందించాడు.
- ఇ) ఉర్దూను రాజభాషగా ప్రకటించాడు. ఉర్దూతోపాటు, ఇంగ్లీష్‌కు కూడా ప్రాముఖ్యతనిస్తూ ఆ భాషలో వార్తా పత్రికలను నిర్వహించాడు.
- ఎఫ్) శక్తి, సామర్థ్యాలను బట్టి ఉద్యోగాలు ఇస్తూ, లంచగొండి, అవినీతి ఉద్యోగులను దండించాడు.
- జి) హైదరాబాద్‌ను విజ్ఞానగని గా మార్చడానికి సయ్యద్ హుస్సేన్ బిల్గామి, సయ్యద్ అలీ బిల్గామి, అఘోరనాథ ఛటోపాధ్యాయ మొదలయిన ఇతర ప్రాంత మేధావులకూ సంస్థానంలో మంచి స్థానం కల్పించి వారి సేవలను వినియోగించుకున్నాడు.
సాలార్జంగ్ – ఆధునిక పరిపాలనా వ్యవస్థ హైదరాబాద్ సంస్థానంలో ఆధునిక పరిపాలనా వ్యవస్థకు శ్రీకారం చుట్టినవారు నిజాం రాజులైతే దానికి మూలకారుడు సాలార్జంగ్. పాశ్చాత్య, ఉదారవాద విధానాలను సాలార్జంగ్ ప్రవేశపెట్టాడు. అతను ప్రవేశపెట్టిన రెవెన్యూ సంస్కరణలు, పరిపాలనా సంస్కరణలు, జిలాబంది విధానం, శిక్షల విధింపు వంటి అంశాలు మార్పులతో ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్నాయి.
నిజాం రాజ్యంలో మధ్యయుగాల నాటి ముస్లిం పరిపాలన కొనసాగింది. కాని పరిపాలనలో వారు మత, జాతి, భాషా భేదాలను పాటించలేదు. సమర్థులు, యోగ్యులైన వారెవరైనా ఉన్నత ఉద్యోగాలలో నియమించాడు. తమ రాజ్యంలో సమర్థులు లేనప్పుడు ఉత్తర భారతదేశం నుంచి పరిపాలనా దక్షులను పిలిపించి తమ ఆస్థానంలో ఉన్నత ఉద్యోగాల్లో నియమించాడు.
సయ్యద్ హుస్సేన్ బిల్గామి, సయ్యద్ ఆలీ బిల్గామి వంటివారికి సముచిత స్థానం కల్పించాడు. చందూలాల్, రాజారాం బక్షి, మహారాజా కిషన్ ప్రసాద్ వంటి హిందువులు కూడా నిజాం రాజ్యంలో ఉన్నత పదవులను అధిష్టించారు.
సాలార్జంగ్ ఘనత సాలార్జంగ్ హైదరాబాద్ రాజ్య అభివృద్ధికి ఎనలేని సేవ చేశాడు. 1853 లో ఆర్థికంగా పతనపు అంచులో ఉన్న నిజాం రాజ్యాన్ని తన ఆర్థిక సంస్కరణల చేత పునర్నిర్మించాడు. అస్తవ్యస్తంగా ఉన్న పరిపాలనా వ్యవస్థను గాడిలో పెట్టాడు. సాలార్జంగ్ సంస్కరణల ఫలితంగా నిజాం రాజ్యంలో నవ చైతన్యం, విద్యాభివృద్ధి, ఆధునీకరణ జరిగాయి. పరిపాలన యంత్రాంగం పటిష్టమైంది. 19వ శతాబ్దపు నాటి ఉత్తమ భారతీయ పాలనావేత్తలలో, రాజనీతిజ్ఞుల్లో సాలార్జంగ్ ఒకరు అని వహీద్భాన్ ప్రశంసించాడు.
హైదరాబాద్ రాజ్యానికి ఎనలేని సేవ చేసినప్పటికీ సాలార్జంగ్ నిజాం రాజుల అభిమానాన్ని పొందలేకపోయాడు. అతని పరిపాలనా దక్షత వల్ల కలిగిన కీరిని, ఇంగ్లీష్‌వారు అతనిని అభిమానించిన తీరు నిజాం రాజు అఫ్టలుద్దాలాకు భయం కలిగించాయి. అందుకే సాలారింగ్ని 1859, 1860, 1867 సంవత్సరాలలో ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించాలని కుట్ర జరిగింది.
కాని 1860 లో బ్రిటీష్ అధికారి కల్నల్ డేవిడ్సన్, 1867లో యూల్ దొర సాలార్ జంగ్ కు బాసటగా నిలిచి అతను పదవిలో కొనసాగటానికి సహాయపడ్డారు. 1869లో అఫ్టలుద్దాలా మరణించటంతో అతని మూడు సంవత్సరాల పసి కుమారుడు మీర్ మెహబూబ్ అలీఖాన్‌కు బ్రిటీష్ ప్రభుత్వం సాలార్జింగ్ని సంరక్షునిగా నియమించింది. తద్వారా సాలార్జంగ్ స్వతంత్రంగా వ్యవహరించి సంస్కరణలను వేగవంతం చేశాడు.
సాలార్జంగ్ ముందు నుంచి బ్రిటీష్ వారికి అనుకూలంగా వ్యవహరించి వారి నుంచి అనేక విధాలుగా రాజ్యానికి లబ్దిని చేకూర్చాడు. సిపాయిల తిరుగుబాటు సందర్భంలో దానిని అణచివేయటానికి బ్రిటీష్ వారికి సంపూర్ణంగా సహకరించాడు. తద్వారా బ్రిటిష్‌వారి అధీనంలో ఉన్న రాయచూర్, ఉస్మానాబాద్ ప్రాంతాలను తిరిగి నిజాం రాజ్యంలో విలీనం చేయటానికి బ్రిటిష్ వారిని ఒప్పించాడు.
బేరార్‌ను కూడా బ్రిటీషావారి నుంచి తిరిగి పొందాలని విశ్వప్రయత్నం చేశాడు. బేరారును నిజాంకు తిరిగి ఇవ్వటం బ్రిటీష్ వారికి ఇష్టం లేదు. అయినప్పటికీ బ్రిటీష్ ప్రభుత్వంతో అనేక ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు. దీనివల్ల ఎంతకూ ఫలితం లేకపోవటంతో 1876లో ఇంగ్లాండ్‌కు వెళ్ళి విక్టోరియా మహారాణిని కలుసుకుని బేరారు విషయాన్ని ప్రస్తావించాడు. రాణి బేరార్‌ను మాత్రం ఇవ్వలేదు. కాని ఆక్సఫర్డ్ విశ్వవిద్యాలయం వారు అతనికి గౌరవ డాక్టరేట్ పట్టాను ఇచ్చి సత్కరించారు.
సాలార్జంగ్ ఇంగ్లాండ్‌కు వెళ్ళి బేరార్ విషయంలో చేసిన ప్రయత్నాలు నాటి వైస్రాయి లార్డ్ లిట్టన్‌కు ఆగ్రహం తెప్పించింది. తద్వారా హైదరాబాద్ రాజ్యంలో సాలార్జంగ్ ప్రాబల్యాన్ని తగ్గించటానికి బ్రిటీష్ వారు ప్రయత్నించారు. హైదరాబాద్ రాజ్యం అత్యంత క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రధాని పదవిని చేపట్టి నిజాం రాజుల కంటే రాజ్యానికి విశిష్ట సేవలు అందించి, వారి కంటే ఘనమైన కీర్తిని చరిత్రలో సంపాదించాడు. అందువల్ల సాలార్జంగ్ కాలాన్ని నిజాం రాజ్య చరిత్రలో నిర్మాణాత్మక యుగమని పలువురు ప్రశంసించారు.
సాలార్జంగ్ 1883 ఫిబ్రవరి, 8న కలరా వ్యాధితో 56 సంవత్సరాల వయస్సులో అకాలమరణం పొందాడు. తన జీవిత కాలాన్ని మొత్తం నిజాం రాజ్యాభివృద్ధికి అంకితం చేసిన గొప్ప పరిపాలనాదక్షుడు, సంస్కరణవాది సాలార్జంగ్.
Download Salarjung Reforms AI Visual Ebook
Reference: Telugu Academy Textbooks | AI-assisted formatting; factual content aligned with the original source.
